యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం పాలక మండలి 3వ సమావేశం మంగళవారం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ భవానీ శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం వైటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ సత్యనారాయణరెడ్డితో పాటు సభ్యులు పాల్గొంటారని వెల్లడించారు.
శివాలయంలో విశేష పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయానికి కొండపైన అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి వారికి సోమవారం పూజారులు విశేష పూజలు నిర్వహించారు. ఉదయమే గర్భాలయంలోని మహా శివుడికి, ముఖ మండపంలోని స్పటిక రామలింగేశ్వరస్వామికి శుద్ధ జలం, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం బిల్వ పత్రాలతో అర్చన చేశారు. సాయంత్రం శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి వారి సేవను ఊరేగించారు. ఇక శ్రీలక్ష్మీనృసింహస్వామి వారి ప్రధానాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు నిత్య కై ంకర్యాలు కొనసాగాయి.
ప్రజావాణికి స్పందన కరువుపై వినూత్న నిరసన
ఆత్మకూరు(ఎం): ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అధికారుల నుంచి సరైన స్పందన కరువైందని ఓ సామాజిక కార్యకర్త వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఆత్మకూరు(ఎం) మండలం రాయిపల్లి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త జెట్ట శ్రీనివాస్ సోమవారం మండల కేంద్రంలో పనిచేయని ఒక పాత పోస్ట్ బాక్స్‌లో తన ఫిర్యాదు పత్రాన్ని వేసి తన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ అనేకసార్లు ప్రజావాణిలో అర్జీలు సమర్పించినప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి అధికారుల నిర్లక్ష్యం వల్ల నిర్వీర్యమవుతోందని, సమస్యలకు పరిష్కారం చూపడంలో విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
యాసంగిలో ఆరుతడి పంటలకే ప్రాధాన్యం
ఆలేరురూరల్: యాసంగిలో ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున, నీటి లభ్యతను బట్టి ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి సూచించారు. సోమవారం ఆలేరు మండలం గొలనుకొండ రైతువేదికలో నిర్వహించిన రైతునేస్తం వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. వరికి బదులుగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయల సాగును ప్రోత్సహించాలన్నారు. భూగర్భ జలాల లభ్యతపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ నిర్మల, ఏఓ శ్రీనివాస్, ఎంపీడీఓ సత్యాంజనేయప్రసాద్, సర్పంచ్ ఇందూరి యాదిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.


