చౌటుప్పల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 50 వేల మంది విద్యార్థులకు ఉదయాన్నే పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లిలో సెంట్రల్ కిచెన్ షెడ్ నిర్మాణ పనులకు హరేకృష్ణ మూమెంట్ చారిటబు ల్ ఫౌండేషన్ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస స్వామీజీ, దివీస్ పరిశ్రమ మేనేజర్ బి. కిశోర్‌కుమార్ చౌదరి సోమవారం శంకుస్థాపన చేశారు. దీని కోసం లింగోజిగూడెం పరిధిలోని దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ సంస్థ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రూ. 12,18,62,700 నిధులను కేటాయించింది. ఈ సందర్భంగా సత్యగౌర చంద్రదాస స్వామీజీ మాట్లాడుతూ విద్యార్థులకు ఉదయాన్నే పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించడం వల్ల వారి ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, చదువుపై ఏకాగ్రత పెరుగుతుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర పథకానికి సెంట్రల్ కిచెన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దివీస్ ల్యాబొరేటరీస్ మేనేజర్ బి. కిశోర్‌కుమార్ చౌదరి మాట్లాడుతూ విద్యాభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి తమ పరిశ్రమ ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తుందన్నారు. అందులో భాగంగానే అత్యధిక సీఎస్‌ఆర్ నిధులను కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హరేకృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ సీఈఓ కౌంతియదాస స్వామీజీ, ప్రతినిధులు కృష్ణప్రేమదాస స్వామీజీ, సద్గురు భక్తదాస స్వామీజీ తదితరులు పాల్గొన్నారు.
ఫ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇక్కడి నుంచే అల్పాహారం
ఫ కిచెన్ షెడ్‌కు శంకుస్థాపన
ఫ రూ. 12.18 కోట్ల సీఎస్‌ఆర్ నిధులు కేటాయించిన దివీస్ ల్యాబొరేటరీస్


