భువనగిరి : సైబర్ నేరాలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ సూచించారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సైబర్ మోసాల పై అవగాహన కల్పించడానికి రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలియని లింక్‌లు క్లిక్ చేయడంతో పాటు ఓటీపీ, పిన్, సీవీవీ వంటి బ్యాంకింగ్ వివరాలను ఇతరులతో పంచుకోవద్దన్నారు. డిజిటల్ అరెస్టు , కేవైసీ,ఫేక్ పోలీస్‌కాల్స్, ఆన్‌లైన్ పెట్టుబడుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.
తాగునీరు అందించడంలో విఫలం
ఆలేరురూరల్: ఇంటింటికీ తాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆలేరు పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వేల కిలోమీటర్లు పైప్‌లైన్‌లు వేసి, ప్రతి గ్రామానికి ఓవర్‌హెడ్ ట్యాంకులు కట్టించి మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందించారని గుర్తు చేశారు. ప్రజా వ్యతిరేక పాలన చేస్తూ దొరికినంత దోచుకో దోచుకున్నది దాచుకో అన్న ధోరణిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. భూకబ్జాలు, ఇసుక దందాలతో నియోజకవర్గంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, రచ్చ రాంనర్సయ్య, బాలస్వామి, పరిదె సంతోష్, మామిడాల భానుచందర్ పాల్గొన్నారు.
కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు
యాదగిరిగుట్ట: విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని డీఐఈఓ సురేష్‌రెడ్డి సూచించారు.యాదగిరిగుట్ట పరిధి లోని యాదగిరిపల్లి ప్రభుత్వ జూనియర్ కళా శాల విద్యార్థులకు మంగళవారం యూనిఫామ్ అందజేసి మాట్లాడారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత దుస్తులు, ఇతర సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మంజూల, అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు.
కార్మికులను నిర్బంధాలకు గురిచేసిన బీఆర్‌ఎస్
యాదగిరిగుట్ట: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసి, నిర్బంధాలకు గురి చేసిందని టీఎంయూ జనరల్ సెక్రటరీ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. మంగళవారం యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడబ్ల్యూయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ మహాకూటమి తరఫున నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత పెండింగ్‌లో ఉన్న రెండు వేతన సవరణలు జరిగాయన్నారు. కార్యక్రమంలో టీడబ్ల్యూయూ రాష్ట్ర అధ్యక్షుడు మొగుళ్ళ రాజిరెడ్డి, వి.ఎస్.రావు, వీర ఆంజనేయులు, పి.రవీందర్‌రెడ్డి, మల్లిఖార్జున్, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశం, జనగాం ఉపేందర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, గున్న ప్రభాకర్‌రెడ్డి, ఎ.ప్రవీణ్, నర్సింహారావు, మార్త కృష్ణయ్య, యాదప్ప తదితరులు పాల్గొన్నారు.


