ఫ ఎత్తిపోతల పథకానికి నీళ్లు ఎక్కడి నుంచి తీసుకోవాలనే విషయంపై వీడని సందిగ్ధం
ఫ సీఎం, మంత్రి చర్చించినా కొలిక్కిరాని అంశం
ఫ నేరుగా శ్రీశైలం నుంచే తీసుకోవాలంటూ సూచించడంతో గందరగోళం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : డిండి ఎత్తిపోతల పథకానికి నీటిని ఎక్కడి నుంచి తీసుకోవాలనే విషయంలో పీటముడి వీడలేదు. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ ప్రాజెక్టు కథ మరోసారి మొదటికొచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వ్యక్తమైన అభ్యంతరాలు ఈ సమస్యను మరింత జఠిలం చేశాయి. సీఎం రేవంత్‌రెడ్డి, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం సమీక్ష చేసినా ఓ కొలిక్కరాకపోవడం.. ఏదుల నుంచి మొత్తం నీటిని మహబూబ్‌నగర్‌కే తీసుకుంటామని, డిండికి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచే తీసుకోవాలంటూ చేసిన ప్రతిపాదనతో ప్రాజెక్టు భవిష్యత్తు గందరగోళంలో పడింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 3.61 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా బీఆర్‌ఎస్ ప్రభుత్వం డిండి ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చింది. 2015లో జూన్ 11న రూ.6,194 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఉత్తర్వులు (జీవో 107) జారీచేసింది. నల్లగొండ జిల్లాలో 5 రిజర్వాయర్ల నిర్మాణ పనులు చేపట్టింది. అవి వివిధ దశల్లో ఉన్నాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం డీపీఆర్‌ను ఆమోదించడంతో పాటు డిండికి నీటిని ఏదులలో ప్రతిపాదించిన వీరాంజనేయ రిజర్వాయర్ నుంచి తీసుకోవాలని నిర్ణయించింది. ఏదుల నుంచే 436.41 అడుగుల నీటిమట్టం నుంచి ఇటు డిండికి, అటు మహబూబ్‌నగర్‌కు నీటిని తరలించాలని నిర్ణయించింది.
ఏదుల నీటిమట్టం విషయంలో పేచీ
ఏదుల రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 445 అడుగులు. రిజర్వాయర్‌లో 436.41 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు మహబూబ్‌నగర్ జిల్లాకు, నల్లగొండ జిల్లాకు నీటిని తీసుకునేలా మొదట నిర్ణయించారు. అయితే మహబూబ్‌నగర్ జిల్లా నేతల ఒత్తిడితో గత ఏడాది ఇంజనీర్ల కమిటీ మరో ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. మహబూబ్‌నగర్‌కు 436.41 అడుగుల వద్ద నీటిని తీసుకునే అవకాశం కల్పిస్తూ, డిండికి మాత్రం 440 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు నీటిని తీసుకోవాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై నల్లగొండ జిల్లాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
తాజా ప్రతిపాదనతో మరింత క్లిష్ట పరిస్థితి
ఏదుల రిజర్వాయర్ నుంచి పూర్తిగా మహబూబ్‌నగర్‌కే నీటిని ఇవ్వాలని, డిండికి నేరుగా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచే తీసుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా నేతలు డిమాండ్ చేస్తున్నారు. అదే జరిగితే డిండి ప్రాజెక్టుకు నీరు అందించడం మరో పెద్ద సవాలుగా మారనుంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ప్రత్యేకంగా కాల్వలు ఏర్పాటు చేసి డిండికి నీటిని తరలించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదన అమలైతే డిండి ప్రాజెక్టు లక్ష్యమే దెబ్బతిని ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుందని ఇక్కడి నేతలు పేర్కొంటున్నారు.


