టై అండ్ డై డిజైన్లతో..
సాక్షి, యాదాద్రి: గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాలు తయారుచేసిన అద్భుతమైన హస్తకళలు, చేనేత వస్త్రాలు, నోరూరించే పల్లె రుచులను నగరవాసులకు నేరుగా చేరువ చేసేందుకు హైదరాబాద్ వేదికగా సరస్ మేళా (సేల్ ఆఫ్ ఆర్టిసన్స్ రూరల్ ప్రాడక్ట్ ఎగ్జిబిషన్)కు రంగం సిద్ధమైంది. తెలంగాణ సెర్ప్ ఆధ్వర్యంలో బుధవారం నుంచి 18వ తేదీ వరకు హుస్సేన్ సాగర్ తీరంలోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో ఈ మేళా జరగనుంది. మహిళా సంఘాల ఉత్పత్తులకు పట్టణ మార్కెట్‌ను కల్పించి, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే వేదికను అందించడమే ఈ మేళా ప్రధాన ఉద్దేశం. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న వారితో కలిపి మొత్తం 204 స్టాళ్లను ఇక్కడ ఏర్పాటు చేయగా, అందులో 95 స్టాళ్లు తెలంగాణ రాష్ట్రానికే కేటాయించారు. ఈ బృహత్తర ప్రదర్శనలో జిల్లా నుంచి ప్రఖ్యాతి గాంచిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలతో పాటు, మన మహిళా సంఘాలు తయారుచేసిన నోరూరించే వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
నేటి నుంచి హైదరాబాద్ సరస్ మేళాలో ఉత్పత్తుల ప్రదర్శన
ఫ పోచంపల్లి ఇక్కత్.. కాటన్ వస్త్రాలు..
ఫ బిర్యానీ నుంచి బొబ్బట్ల దాకా స్టాళ్లు
ఫ జిల్లా నుంచి నాలుగు సమభావన సంఘాలకు ప్రాతినిధ్యం
జిల్లా నుంచి సరస్ మేళాలో చేనేత వస్త్రాలది ప్రత్యేక స్థానం. పోచంపల్లికి చెందిన ఉదయశ్రీ స్వయం సహాయక సంఘం ప్రతినిధి చిలువేరు శృతి ఆధ్వర్యంలో పట్టు ఇక్కత్ వస్త్రాల స్టాల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో సంప్రదాయ టై అండ్ డై డిజైన్లతో కూడిన పట్టు చీరలు, డ్రెస్ మెటీరియల్స్, దుపట్టాలు, స్టోల్స్‌ను ప్రదర్శించి విక్రయించనున్నారు. అలాగే, చౌటుప్పల్ మండలం కొయ్యలగూడేనికి చెందిన స్వాతి సమభావన సంఘం ప్రతినిధి శోభారాణి టై అండ్ డై కాటన్ వస్త్రాలను మేళాకు తీసుకువస్తున్నారు. ఇందులో బెడ్‌షీట్లు, కాటన్ షర్ట్‌లు, ఫ్రాక్‌లు, లేడీస్ టాప్‌లు, చున్నీలు, వాల్ హ్యాంగింగ్స్ వంటి పలురకాల చేనేత ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి.


