స్వర్ణగిరీశుడికి అష్టదళ పాదపద్మార్చన సేవ | - | Sakshi
Sakshi News home page

స్వర్ణగిరీశుడికి అష్టదళ పాదపద్మార్చన సేవ

Apr 9 2026 8:23 AM | Updated on Apr 9 2026 8:23 AM

భువనగిరి : పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం స్వామివారికి అష్టోత్తర శతనామాలతో అష్టదళ పాదపద్మార్చన సేవను ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, సహస్రనామార్చన సేవ, నిత్య కల్యాణం, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో

విద్యార్థి మృతి

పెన్‌పహాడ్‌ : తాటి ముంజలు కోస్తుండగా విద్యుదాఘాతానికి గురై విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటన పెన్‌పహాడ్‌ మండలం గాజులమల్కాపురం గ్రామంలో బుధవారం జరిగింది. ఎస్‌ఐ గోపికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గాజులమల్కాపురం గ్రామానికి చెందిన నర్సింగోజు కనకాంబ్రచారి, శ్రీలత దంపతుల చిన్న కుమారుడు నర్సింగోజు నిఖిల్‌(14) గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. ఒంటి పూట బడులు కావడంతో బుధవారం గ్రామ శివారులో తాటి ముంజలు కోసేందుకు స్నేహితులతో కలిసి వెళ్లాడు. నిఖిల్‌ ఇనుప రాడ్డుకు కొడవలి కట్టి తాటిచెట్టుకు ముంజలు కోస్తుండగా.. పక్కనే ఉన్న విద్యుత్‌ వైర్లకు ఇనుప రాడ్డు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి పక్కనే ఉన్న మణికంఠకు గాయాలయ్యాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

డిండి: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను బుధవారం డిండి పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండల పరిధిలోని ప్రతాప్‌నగర్‌, జేత్యతండాకు చెందిన నాలుగు ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా.. సమాచారం తెలుసుకున్న సీఐ బీసన్న, ఎస్‌ఐ బాలకృష్ణ, పోలీస్‌ సిబ్బందితో బాపన్‌కుంట సమీపంలో నాలుగు ట్రాక్టర్లతో పాటు వాటికి రక్షణగా వెళ్తున్న రెండు బైక్‌లను పట్టుకొని స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపారు.

గీత కార్మికుడికి గాయాలు

వలిగొండ : తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వలిగొండ మండలం సుంకిశాలలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సుంకిశాల గ్రామానికి చెందిన గీత కార్మికుడు కొమ్మగాని ఐలయ్యగౌడ్‌ రోజుమాదిరిగా బుధవారం కల్లు గీసేందుకు గ్రామ పరిధిలో తాటిచెట్టు ఎక్కుతుండగా.. ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు గమనించి 108 సిబ్బంది సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి ఐలయ్యను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

రేషన్‌ నిల్వల్లో

వ్యత్యాసం ఉండొద్దు

చండూరు : రేషన్‌ దుకాణాల్లో రేషన్‌ బియ్యం నిల్వల్లో వ్యత్యాసం ఉంటే కేసులు నమోదు చేయడంతో పాటు డీలర్‌షిప్‌ రద్దుకు సిఫారసు చేస్తామని పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ రఘునందన్‌ బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. పౌరసరఫరాల గిడ్డంగి నుంచి స్టాక్‌ రేషన్‌ దుకాణానికి రాకముందే కొందరు డీలర్లు బియ్యం అమ్ముకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయన్నారు. రేషన్‌ పంపిణీలో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement