కొబ్బరికాయ రూ.100
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. కొండపైన దుకాణదారులు అధిక ధరలకు కొబ్బరికాయలను విక్రయిస్తున్నారు. ఒక్కో కొబ్బరికాయ రూ.100కు అమ్ముతున్నారు. అధిక ధరలకు కొబ్బరికాయలు అమ్మడంపై ఈ నెల 2న సాక్షి దినపత్రికలో ‘అంతా ఇష్టారాజ్యం’ అనే శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనికితోడు అధిక ధరకు కొబ్బరికాయల విక్రయాలపై భక్తులు సైతం అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆలయ ఈఓ స్పందించారు. ఈనెల 3వ తేదీన అధికారులు.. దుకాణదారుల వద్దకు వెళ్లి కొబ్బరికాయలు దేవస్థానం నిర్ణయించిన ధర ప్రకారం 40 రూపాయలకే విక్రయించాలని చెప్పడంతోపాటు అన్ని దుకాణాల వద్ద ఆలయ సిబ్బందితో స్టిక్కర్లు సైతం అతికించారు. కానీ కార్తీక మాసం చివరి వారం కావడంతో దుకాణదారులు మాత్రం భక్తులకు కొబ్బరికాయతో పాటు చిన్న తులసీ, పూలు సైతం ఇస్తూ వారి నుంచి రూ.100 వసూలు చేస్తూ యాదగిరిగుట్ట ఆలయ నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు.
తులసీ దేవుడికి..
కొబ్బరికాయ బయట కొట్టాలని..
కార్తీక మాసం తులసీ మాల దేవుడి వద్ద పెట్టాలి.. కొబ్బరికాయ బయట కొట్టాలి అంటూ దుకాణదారులు భక్తులకు చెబుతున్నారు. తులసీ లేకుంటే ఏమి అవుతుందని.. కొబ్బరికాయ ఒక్కటే ఇవ్వమని భక్తులు అంటే.. కార్తీక మాసం తులసీ మాల దేవుడికి వేస్తారు.. కొబ్బరికాయ బయట కొడతారు.. కొబ్బరికాయ, తులసీ మాలకు రూ.100 ఇవ్వాల్సిందే అంటూ దుకాణదారులు భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వేరే దేవాలయాల్లో కొబ్బరికాయ రూ.40, రూ.50కే అమ్ముతుంటే.. యాదగిరిగుట్ట దేవస్థానంలో మాత్రం రూ.100 కొబ్బరికాయ అమ్మడం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
గతంలో మాదిరిగా దేవస్థానమే నడిపించాలి
యాదగిరి కొండపైన కొబ్బరికాయల వ్యాపారులు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుండడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానం టెండర్ ప్రకారం రూ.40కే కొబ్బరికాయ విక్రయించాలని సూచించినప్పటికీ దుకాణదారులు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. ఇటీవల సెలవులు ముగించుకొని వచ్చిన ఈఓ వెంకట్రావ్ దుకాణాల వద్దకు వెళ్లి అధిక ధరలకు కొబ్బరికాయలు విక్రయించవద్దని హెచ్చరించారు. మరుసటి రోజే డిప్యూటీ ఈఓ భాస్కర్‌శర్మ, సంబంధిత శాఖ అధికారులు కలిసి దుకాణదారులతో కలిసి సమావేశం నిర్వహించి, అధిక ధరలకు అమ్మకాలు ఉండవద్దని హెచ్చరించారు. అయినప్పటికి కార్తీక మాసాన్ని ఆసరాగా చేసుకొని అధిక మొత్తంలో భక్తుల వద్ద కొబ్బరికాయలు అమ్ముతున్నారు. ఈఓ వెంకట్రావ్ హెచ్చరించినా తీరు మారకపోవడంతో స్థానిక భక్తులు దుకాణదారులపై మండిపడుతున్నారు. గతంలో మాదిరిగానే దేవస్థానమే కొబ్బరికాయల దుకాణాన్ని నిర్వహించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా చేస్తే దోపిడీకి అడ్డుకట్ట వేయవచ్చునని భక్తులు అంటున్నారు.
రూ.40కే కొబ్బరికాయ అమ్మాలని స్టిక్కర్
వేస్తున్న ఆలయ సిబ్బంది (ఫైల్)
కొబ్బరికాయల ధర గురించి దుకాణదారులతో మాట్లాడుతున్న ఈఓ వెంకట్రావ్ (ఫైల్)
ఫ యాదగిరిగుట్టపై
అధిక ధరకు అమ్మకాలు
ఫ అదనంగా తులసీ, పూలు
అంటగడుతూ వసూలు
ఫ రూ.40కే విక్రయించాలని ఇటీవల ఆలయ ఈఓ ఆదేశాలు
ఫ షాపుల వద్ద స్టిక్కర్లు అంటించినా
తీరుమారని దుకాణ దారులు
కొబ్బరికాయ రూ.100


