సాక్షి దినపత్రిక ఫొటో జర్నలిస్టుకు అవార్డు
నల్లగొండ టూటౌన్: సౌత్ ఇండియా మీడియా అసోసియేషన్ (సీమ) ఆధ్వర్యంలో డిసెంబర్ 6న బెంగళూరులో నిర్వహించనున్న సీమ ఉత్తమ ఫొటో జర్నలిస్ట్ అవార్డు–2025కు నల్లగొండ జిల్లా సాక్షి సీనియర్ ఫొటో జర్నలిస్ట్ కంది భజరంగ్ ప్రసాద్ ఎంపికై నట్లు సీమ జనరల్ సెక్రటరీ ఎన్.కె. స్వామి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మీడియాలో సేవలు అందించినందకు ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ అవార్డును కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి మంత్రులు అందజేయనున్నట్లు వివరించారు.
యాదగిరీశుడి సేవలో
వేం నరేందర్‌రెడ్డి
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, కలెక్టర్ హనుమంతరావు, ఆర్డీఓ కృష్ణారెడ్డి, తహసీల్దార్ గణేష్ సంప్రదాయంగా స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వయంభూమూర్తులను దర్శించుకొని, ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తుల చెంత అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. వేం నరేందర్‌రెడ్డి, కుటుంబ సభ్యులకు అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా.. ఆలయ ఈఓ వెంకట్రావ్ లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అంతకుముందు సత్యనారాయణస్వామి వ్రత పూజల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
● అఖిల బ్రాహ్మణ సంఘం రాష్ట్ర
అధ్యక్షుడు బొల్లా వేణుగోపాలరావు
సూర్యాపేట: ప్రభుత్వం బ్రాహ్మణ పరిషత్‌కు నిధులు విడుదల చేసి, బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అఖిల బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లా వేణుగోపాలరావు అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా బ్రాహ్మణ భవన్‌లో గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా కార్తీక వన సమారాధన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బ్రాహ్మణ సంక్షేమం కోసం ఐక్యంగా ఉండి పనిచేయాలని అన్నారు. పేద బ్రాహ్మణ విద్యార్థులకు ఆర్థిక సహాయం, ఉపకార వేతనాలు అందించడం, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం వంటివి సంఘం ద్వారా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, గాయత్రి సేవా సంస్థ వ్యవస్థాపకుడు గర్నపూడి శ్రీరామశర్మ, డాక్టర్ యజ్ఞం పవన్‌కుమార్‌శర్మ, చకిలం అనిత, రజిని, మణికుంట్ల రాజేశ్వర శర్మ, రుద్రవీణ బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు.
భార్యను హత్య చేసిన
భర్త అరెస్టు
మోతె: మోతె మండలం సిరికొండ గ్రామంలో ఆదివారం రాత్రి భార్యను రోకలిబండతో మోది హత్య చేసిన భర్తను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, మోతె ఎస్‌ఐ అజయ్‌కుమార్ ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం హత్యకు పాల్పడిన నిందితుడు కారింగుల వెంకన్నను అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేశారు.
సాక్షి దినపత్రిక ఫొటో జర్నలిస్టుకు అవార్డు


