గంజాయి విక్రయిస్తున్న యువకుల అరెస్టు
హాలియా: గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను హాలియా పోలీసులు అరెస్టు చేసినట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు తెలిపారు. మంగళవారం హాలియా పోలీస్ స్టేషన్‌లో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. హాలియాకు చెందిన మహమ్మద్ రియాజ్ బాబా, సల్లా అజయ్, అనుముల మండలం హజారిగూడెంకు చెందిన షేక్ జీషాన్ హుస్సేన్‌తో పాటు అలీనగర్(చెక్‌పోస్ట్)కు చెందిన అమరవరపు జేమ్స్, హాలియాకు చెందిన కేశమల్ల అంజి స్నేహితులు. గంజాయికి అలవాటుపడిన వీరు ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన చల్లా చిన్న ఆంజనేయులు, చల్లా పెద్ద ఆంజనేయులు వద్ద గంజాయి కొనుగోలు చేసి హాలియా పరిసర ప్రాంతాలకు చెందిన యువతకు విక్రయించేవారు. ఈ క్రమంలో వారు మంగళవారం అల్వాల ఎక్స్ రోడ్డు వద్ద గంజాయి విక్రయిస్తుండగా.. పక్కా సమాచారం మేరకు హాలియా ఎస్‌ఐ సాయిప్రశాంత్ తన సిబ్బందితో వెళ్లి మహమ్మద్ రియాజ్, సల్లా అజయ్, షేక్ జీషాన్ హుస్సేన్, చల్లా చిన్న ఆంజనేయులను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 1200 గ్రాముల గంజాయి, పల్సర్ బైక్, నాలుగు సెల్‌ఫోన్లు, రూ. 2వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరా చేసే చల్లా పెద్ద ఆంజనేయులుతో పాటు అలీనగర్‌కు చెందిన అమరవరపు జేమ్స్, హాలియాకు చెందిన కేశమల్ల అంజి పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో హాలియా సీఐ సతీష్‌రెడ్డి, ఎస్‌ఐ సాయిప్రశాంత్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న
మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు
1200 గ్రాముల గంజాయి స్వాధీనం


