మహిళా శక్తికి మారుపేరు ధీశాలి
బొమ్మలరామారం: బొమ్మలరామారం మండలంలోని మహిళా రైతులు ‘ధీశాలి మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్’ను ఏర్పాటు చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. సోలీపేట గ్రామీణ మహిళా మండలి అధ్యక్షురాలు దూబల విజయలక్ష్మి 2017–18లో మండలంలోని 12 గ్రామాల్లోని 716 మహిళలతో ధీశాలి మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కంపెనీలో పది మంది డైరెక్టర్లు, సీఈఓ పనిచేస్తూ నాబార్డు సహకారంతో మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేస్తున్నారు. రూ.46 లక్షల టర్నోవర్ సాధించి ప్రగతి దిశగా పయనిస్తోంది.
సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యం
ధీశాలి మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ సేంద్రియ వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. రసాయన మందులతో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తే కలిగే అనర్ధాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. 20 మంది మహిళా రైతులకు ఖేతి పథకం ద్వారా ఒక్కో యూనిట్‌కు 85 శాతం సబ్సిడీతో రూ.93వేల విలువైన షేడ్ నెట్‌హౌజ్‌లను సైతం అందించి సేంద్రియ పద్ధతిలో ఆకుకూరలు, కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నారు. ఈ కంపెనీలోని మహిళా రైతులు సేంద్రియ వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్‌తో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు, పండించిన కూరగాయలను మార్కెటింగ్ చేసుకునేందుకు నాబార్డు సహకారంతో రూ.5లక్షల సబ్సిడీతో డీసీఎంను సైతం సమకూర్చుకున్నారు. గానుగతో వేరుశనగ, కొబ్బరి, కుసుమ, నువ్వులతో స్వచ్ఛమైన నూనెల తయారీ, కూరగాయలకు గిట్టుబాటు ధర లేకుంటే ఫుడ్ ప్రాసెసింగ్, సోలార్ డ్రైయర్‌లో ఆరబెట్టిన కూరగాయలు, టమాట సాస్, నిల్వ పచ్చళ్ల తయారీ వంటి వాటిపై శిక్షణ సైతం అందిస్తున్నారు.
సామాజిక సేవలో సైతం..
ధీశాలి మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ సభ్యులు సామాజిక సేవలో సైతం భాగస్వాములవుతున్నారు. కరోనా సమయంలో మహిళా రైతులు తాము పండించిన కూరగాయలతో పాటు శానిటైజర్లు, మాస్కులు, కిరాణ సరుకులను ఇటుక బట్టీల వద్ద ఒరిస్సా కార్మికులకు తదితరులకు ఉచితంగా అందజేశారు. అనేక సేవా కార్యక్రమాలు సైతం చేపట్టారు.
మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ
లిమిటెడ్ ఏర్పాటు చేసి ఆర్థిక స్వావలంబన
దిశగా అడుగులు
పండించిన కూరగాయలను స్వయంగా
మార్కెటింగ్ చేసుకుంటూ లాభాల బాటలో..
కొనుగోలు కేంద్రాల ఏర్పాటు,
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణ
కూరగాయలు సాగు చేసే రైతులను ప్రోత్సహించాలి
చీకటిమామిడి గ్రామంలో వెజిటెబుల్ కలెక్షన్ సెంటర్‌తో పాటు కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేస్తే స్థానిక మహిళా రైతులకు సౌకర్యవంతంగా ఉంటుంది. మార్కెటింగ్ అవసరాలకు అర ఎకరం ప్రభుత్వ భూమిని కేటాయించి కూరగాయలు సాగు చేసే రైతులను ప్రోత్సహించాలి. సేంద్రియ వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్‌తో పాటు కూరగాయలు అమ్ముకునేందుకు రూరల్ మార్ట్ మరియు ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల షాపుల నిర్వహణ, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నాం.
– దూబల విజయ లక్ష్మి, గ్రామీణ మహిళా మండలి అధ్యక్షురాలు, సోలీపేట
మహిళా శక్తికి మారుపేరు ధీశాలి
మహిళా శక్తికి మారుపేరు ధీశాలి
మహిళా శక్తికి మారుపేరు ధీశాలి


