ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టాలి
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల స్థానాలను వెంటనే భర్తీ చేసేందుకు ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, ఇందులో స్థానికులకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గోద శ్రీరాములు డిమాండ్ చేశారు. మంగళవారం యాదగిరి దేవస్థానంలో నెలకొన్న సమస్యలపై భక్తుల ద్వారా సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రిటైర్డ్ అయిన ఉద్యోగుల స్థానంలో నూతన నియామకాలు చేపట్టకపోవడంతో ఉన్న ఉద్యోగులపై పనిభారం పడుతుందన్నారు. తాము నిర్వహించిన సర్వేలో 100కు పైగా సమస్యలున్నట్లు భక్తులు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. ప్రధానంగా పట్టణంలోని యోగానంద నిలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. కొండపైన పుష్కరిణి, దుకాణాలు, ప్రసాద విక్రయశాల, కల్యాణ కట్ట వంటి ప్రాంతాల్లో సమస్యలు అధికంగా కనిపించాయన్నారు. ఇటీవల ఏసీబీకి పట్టుబడిన ఈఈ రామారావు లాంటి అధికారులు కొంతమంది ఉన్నారని, వారు తమ పద్ధతిని మార్చుకోవాలన్నారు. రామారావుకు సంబంధించిన ఆస్తులు, భూములు, నగదు, బినామీల వివరాలను ఏసీబీ ఇప్పటి వరకు ప్రకటించలేదని అన్నారు. యాదగిరి కొండపైన బస్టాండ్‌లో దుకాణాలు ఏర్పాటు చేయడంతో బస్సులు నిలిపేందుకు, భక్తులు వేచి ఉండేందుకు స్థలం లేకుండా పోయిందన్నారు. కొండపైన డార్మిటరీ హాల్‌లో మరిన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. దుకాణాలను పద్ధతి ప్రకారం నిర్వహించాలని పేర్కొన్నారు. సమస్యలను త్వరలోనే ప్రభుత్వం, ఆలయ ఈఓ దృష్టికి తీసుకెళ్తామని, పరిష్కరించకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ సర్వేలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, బండి జంగమ్మ, పేరబోయిన మహేందర్, పట్టణ కార్యదర్శి బబ్బూరి శ్రీధర్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు, నాయకులు గోపగాని రాజు, పేరబోయిన బంగారు, ఆరె పుష్ప, మద్దురి భాగ్యమ్మ తదితరులున్నారు.
సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు
గోద శ్రీరాములు


