పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
యాదగిరిగుట్ట రూరల్: పత్తి కొనుగోళ్లు వేగవంతం చేసి రాష్ట్ర ప్రభుత్వ రైతులను ఆదుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. పత్తి రైతుల సమస్యలు తెలుసుకోవడానికి మంగళవారం హరీష్‌రావుతో పాటు మాజీ స్పీకర్ మధుసూదనాచారి హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లాకు వెళ్తుండగా.. యాదగిరిగుట్ట మండలం బాహుపేట గ్రామ స్టేజీ వద్ద ఆలేరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకులు స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఆలేరు ప్రాంతంలో వరి ధాన్యం కొనుగోళ్లు ఎలా ఉన్నాయని రైతులను, యాదగిరిగుట్ట పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రాంరెడ్డిని హరీష్‌రావు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు అప్పగించిందని, ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను అమ్ముకోలేక దయనీయ స్థితిలో ఉన్నామని, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి కొనుగోళ్లు జరిగేలా చూడాలని రైతులు, నాయకులు ఆయనకు విన్నవించారు. సన్నాలకు బోనస్ కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, ఆలేరు మున్సిపల్ మాజీ చైర్మన్ వస్పరి శంకరయ్య, మండల కురుమ సంఘం అధ్యక్షుడు కవిడె మహేందర్, కుండె క్రాంతి, పంజాల సురేష్, శ్రీశైలం, సంపత్, సత్తిబాబు, కర్ణాకర్, రాజు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి హరీష్‌రావు


