రైతులను ఇబ్బంది పెట్టొద్దు
చౌటుప్పల్, వలిగొండ : ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. సోమవారం చౌటుప్పల్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో, వలిగొండ మండలం సంగెం గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. ధాన్యంలో తేమ శాతం పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోళ్లలో వేగం పెంచాలని, రైస్‌మిల్లుల వద్ద లారీలను ఆపుకోవద్దని మిల్లర్లకు సూచించారు. అవసరవైతే అదనంగా లారీలను పంపాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు సరిపడా లారీలు పంపకుంటే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు, నిర్వాకులకు పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ చౌటుప్పల్‌లోని ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించారు. ఆర్డీఓ చాంబర్‌లో భూ భారతి దరఖాస్తులపై ఆర్డీఓ శేఖర్‌రెడ్డితో సమీక్షించారు. డివిజన్‌లోని మండలాల వారీగా క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఆయన వెంట ఆర్డీఓ వెల్మ శేఖర్‌రెడ్డి, వ్యవసాయాధికారి ముత్యాల నాగరాజు, ఆర్‌ఐ సుధాకర్‌రావు, మార్కెట్, ఐకేపీల సిబ్బంది, రైతులు ఉన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు


