
బైక్ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య
నూతనకల్: బైక్ కొనివ్వలేదని మనస్తాపంతో ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నూతనకల్ మండల పరిధిలోని తాళ్లసింగారం గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లసింగారం గ్రామానికి చెందిన పల్సా భిక్షం కుమారుడు పల్సా గణేష్(17) పాలిటెక్నిక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తనకు కొత్త బైక్ కొనివ్వాలని దసరా రోజు గణేష్ తన తల్లిదండ్రులను అడగగా.. వారు అందుకు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన గణేష్ శుక్రవారం రాత్రి ఇంట్లోని తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడు మనస్తాపానికి గురైన విషయాన్ని అర్థం చేసుకున్న తండ్రి శనివారం తెల్లవారుజామున గణేష్ గదిలోకి వెళ్లగా అతడు ఉరికి వేలాడుతూ కనిపించాడు. చుట్టుపక్కల వారికి విషయం చెప్పి కిందకు దించి చూడగా అప్పటికే అతడు మృతిచెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తుంగతుర్తి ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
గుర్తుతెలియని
మృతదేహం లభ్యం
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ డ్యాం దిగువన ఆంజనేయ స్వామి పుష్కరఘాట్‌కు 50 అడుగుల దూరంలో కృష్ణా నది తీరంలో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉందని స్థానికులు తెలిపారు. ఇటీవల కృష్ణా నదిలో ముగ్గురు గల్లంతు కావడం గమనార్హం.