
ట్రాక్టర్ కింద పడి యువకుడు మృతి
కట్టంగూర్: ట్రాక్టర్ కింద పడి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కట్టంగూర్ మండలం పరడ గ్రామంలో శుక్రవారం జరగగా.. శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరడ గ్రామానికి చెందిన కొండూరి నరేష్(26) కూలీ పనులతో పాటు అదే గ్రామానికి చెందిన నిమ్మనగోటి భాస్కర్ ట్రాక్టర్‌పై డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం గ్రామంలోని ఓ రైతు తన పొలాన్ని హార్వెస్టర్‌తో కోయిస్తుండగా.. వరి ధాన్యాన్ని తరలించేందుకు ట్రాక్టర్ యజమాని పిలుపు మేరకు నరేష్ ట్రాక్టర్‌ను తీసుకెళ్లాడు. మధ్యాహ్న సమయంలో హార్వెస్టర్ డ్రైవర్‌తో పాటు అక్కడ ఉన్న వారు భోజనం చేసేందుకు వెళ్లారు. అదే సమయంలో నరేష్ కూడా విశ్రాంతి తీసుకునేందుకు ట్రాక్టర్ ట్రాలీ కింద పడుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత వరికోత తిరిగి ప్రారంభం కాగా. నరేష్ కనిపించకపోవటంతో అదే గ్రామానికి మరో ట్రాక్టర్ డ్రైవర్ ఎస్‌కే రహీమ్ నరేష్ నడిపే ట్రాక్టర్‌ను స్టార్ట్ చేసి ముందుకు కదిలించాడు. దీంతో ట్రాక్టర్ ట్రాలీ కింద నిద్రించిన నరేష్ తలపై నుంచి టైరు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శనివారం మృతుడి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు రహీమ్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవీందర్ తెలిపారు.