
సాగర్‌కు సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి
నాగార్జునసాగర్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌ను శనివారం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సందర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లోని బెల్లంకొండలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్తూ నాగార్జునసాగర్‌ను సందర్శించారు. సాగర్ డ్యాం, ప్రధాన జలవిద్యుత్ ఉత్పాదన కేంద్రం, నాగార్జునకొండ ప్రాంతాలను సందర్శించారు. స్థానిక గైడ్ సత్యనారాయణ చారిత్రక విశేషాలను వివరించారు.
చింతపల్లి సాయిబాబాను
దర్శించుకున్న మాజీ సీజేఐ
కొండమల్లేపల్లి(చింతపల్లి): చింతపల్లి మండల కేంద్రంలో గల సాయిబాబా ఆలయాన్ని శనివారం సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాబా క్షేత్రం ఎంతో ఆధ్యాత్మికంగా ఉందని పేర్కొన్నారు. ఆయన వెంట శ్రీనివాసరాజు, ఆలయ నిర్వాహకులు ఉన్నారు.
ఆర్టీసీ కండక్టర్ అదృశ్యం
చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం డి.నాగారం గ్రామానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డి.నాగారం గ్రామానికి చెందిన సుర్కంటి కిరణ్‌రెడ్డి(32) కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో నివాసముంటూ దిల్‌సుఖ్‌నగర్ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి నాలుగేండ్ల క్రితం వివాహం జరిగింది. వారికి సంతానం కల్గలేదు. గత రెండేళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో కిరణ్‌రెడ్డి గత ఆరు నెలల నుంచి భార్యకు దూరంగా.. గత రెండు నెలలుగా ఉద్యోగానికి వెళ్లకుండా స్వగ్రామం డి.నాగారంలోనే ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రించాడు. కుటుంబ సభ్యులు శనివారం తెల్లవారుజామున నిద్ర లేచి చూడగా కిరణ్‌రెడ్డి కనిపించలేదు. అతడు బైక్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల మొత్తం వెతికారు. ఎంతకీ ఆచూకీ లభించకపోవడంతో కిరణ్‌రెడ్డి సోదరుడు గోపాల్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.
బహిర్భూమికి వెళ్లి మృతి
నూతనకల్: బహిర్భూమికి వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన నూతనకల్ మండలం తాళ్లసింగారం గ్రామంలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లసింగారం గ్రామానికి చెందిన గంజి ధర్మపురి కుమారుడు గంజి రాము(41) సూర్యాపేట జిల్లా కేంద్రంలో నివాసముంటున్నాడు. దసరా పండుగకు స్వగ్రామానికి వచ్చిన రాము బుధవారం సాయంత్రం బహిర్భూమి కోసం గ్రామ శివారులోని వాగు వద్దకు వెళ్లాడు. ఎంతసేపటికీ అతడు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వారిని ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. శనివారం వాగు వద్దకు వెళ్లిన వ్యక్తులకు నీటిలో మృతదేహం తేలియాడుతుండడం చూసి గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు వచ్చి చూసి మృతిచెందింది గంజి రాముగా గుర్తించారు. మృతుడి సోదరుడు సుభాష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.