
విషాదం నింపిన గెట్ టుగెదర్
నార్కట్‌పల్లి: దసరా సెలవుల్లో ఓ ఫాంహౌస్‌లో కలుసుకున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు సరదాగా నీటి సంపులో దిగి ఈత కొడుతుండగా.. ప్రమాదవశాత్తు అందులో మునిగి ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన నార్కట్‌పల్లి మండలం జువ్విగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వర్లబావి గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లి మండల కేంద్రానికి చెందిన నల్లగొండ నాగరాజు, స్వాతి దంపతుల పెద్ద కుమారుడు రిషిక్(17), చౌటుప్పల్ పట్టణానికి చెందిన పోలోజు శ్రీను పెద్ద కుమారుడు హర్షవర్ధన్(17)తో పాటు మరికొంత మంది నార్కట్‌పల్లి సమీపంలోని విద్యాపీఠ్ పాఠశాలలో కలిసి పదో తరగతి చదువుకున్నారు. ప్రస్తుతం వారంతా హైదరాబాద్‌లో వేర్వేరు కళాశాలల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. రిషిక్, హర్షవర్ధన్‌తో పాటు నార్కట్‌పల్లి, చౌటుప్పల్, చిట్యాల, హైదరాబాద్, నకిరేకల్ తదితర ప్రాంతాలకు చెందిన 15 మంది స్నేహతులు కలసి దసరా సెలవుల్లో నార్కట్‌పల్లిలో కలుసుకుందామని నిర్ణయించుకున్నారు. శనివారం అందరూ కలిసి నార్కట్‌పల్లికి చేరుకుని వారిలో ఓ స్నేహితుని తండ్రి సహకారంతో జువ్విగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వరబావి గ్రామ సమీపంలో ఓ డీఎస్పీకి చెందిన ఫాంహౌస్‌లో కలుసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అక్కడికి చేరుకొని సరదాగా గడిపారు. మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం రిషిక్, హర్షవర్ధన్‌తో పాటు మరో ఇద్దరు ఈత కొట్టేందుకు ఫాంహౌస్‌లోని నీటి సంపులోకి దిగారు. రిషిక్‌కు ఈత సరిగా రాక అందులో మునిగిపోయాడు. దీంతో హర్షవర్ధన్ వెంటనే రిషిక్‌ను కాపాడేందుకు యత్నించగా.. అతడు కూడా నీటి సంపులో మునిగిపోయాడు. వారి స్నేహితులు వెంటనే ఫాంహౌస్ వద్ద పనిచేస్తున్న వ్యక్తికి విషయం తెలియజేయగా.. అతడు ఫాంహౌస్ యజమానికి సమాచారం ఇచ్చాడు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నార్కట్‌పల్లి ఎస్‌ఐ క్రాంతికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో ఇద్దరు విద్యార్థులను నీటి సంపు నుంచి బయటికి తీయగా అప్పటికే మృతిచెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. రిషిక్ తల్లిదండ్రులు నార్కట్‌పల్లి మండల కేంద్రంలోనే కిరాణ దుకాణం నడిపిస్తుండగా, హర్షవర్ధన్ తండ్రి చౌటుప్పల్ మండల కేంద్రంలో రేడియం దుకాణం నిర్వహిస్తున్నాడు.
నీటి సంపులో నుంచి విద్యార్థులను
బయటకు తీయిస్తున్న పోలీసులు
రోదిస్తున్న రిషిక్ తల్లి
ఫ ఫాంహౌస్‌లో కలుసుకున్న
పదో తరగతి స్నేహితులు
ఫ అందులోని నీటి సంపులో ఈత కొడుతూ నీట మునిగి ఇద్దరు మృతి
ఫ నార్కట్‌పల్లి మండలం జువ్విగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఘటన

విషాదం నింపిన గెట్ టుగెదర్

విషాదం నింపిన గెట్ టుగెదర్

విషాదం నింపిన గెట్ టుగెదర్