
చేతికొచ్చిన చేనుకు దోమ పోటు
రైతులు అప్రమత్తంగా ఉండాలి
రామన్నపేట: అన్నదాతను సుడిదోమ కలవరపెడుతోంది. వరి కోతకొస్తున్న తరుణంలో పంటను కాటేస్తోంది. ఒక్క పూటలోనే చేనంతా వ్యాప్తి చెంది గింజ నల్లబారి, పొలం ఎండిపోయే ప్రమాదం ఉంది. రైతులు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.
దిగుబడిపై ప్రభావం
జిల్లాలో 2,82, 897 ఎకరాల్లో వరి సాగు చేశారు. చేలు ఆశాజనకంగా ఉండడంతో ఎకరాకు సరాసరి 25 క్వింటాళ్ల చొప్పున ఏడు లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. మొదట నాటు వేసిన పొలాలు తడితప్పి కోతదశలో ఉన్నాయి. ఈ దశలో సుడిదోమ కాటు (పోటు) తెగులు సోకుతుండటంతో దిగుబడిపై ప్రభావం చూపనుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈసారి దొడ్డురకానికి..
సాధారణంగా సన్నరకం వరికి సుడిదోమ బెడద ఎక్కువగా ఉంటుంది. కానీ, ఈసారి దొడ్డురకం చేలకు విపరీతంగా సుడిదోమ ఆశించింది. సెప్టెంబర్‌లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల వాతావరణంలో తేమశాతం అధికంగా ఉండడం, మోతాదుకు మించి యూరియా వాడడంతో చేలు ఏపుగా పెరిగాయి. చేనుకు గాలి తగలక పోవడం, నీరు అధికంగా నిలువ ఉండడం దోమపోటుకు ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు.
వ్యాధి లక్షణాలు
● సుడిదోమ సోకిన చేను పత్రాలు ఒకే రోజులో పసుపురంగులోకి మారి ఎండిపోతున్నాయి.
● గింజల్లో రసంపోయి నల్లబారి తాలు మాదిరిగా మారుతాయి.
● చేను నేలవారి కోతకు వీలు లేకుండా పోతుంది.
నివారణ చర్యలు
ప్రతి రోజూ పొలాలను పరిశీలించాలి. గాలి తగిలి, పొలం ఆరడానికి చేనులో పాయలు తొక్కాలి. పొలాంలో నీటిని పూర్తిగా బయటకు తీయాలి. నివారణకు పైమెట్రోజోన్, ట్యూప్లీమెజీపిరియం, స్ప్రేడినోటిఫురాన్, బూప్రోఫీజిన్ వంటి రసాయన మందులను వ్యవసాయ అధికారుల సూచనల ప్రకారం చేను మొత్తం తడిచేలా పిచికారీ చేయాలి.
సుడి దోమతో నల్లబారుతున్న వరి
దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం
ఆందోళనలో రైతులు
సుడిదోమ పోటు విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. లక్షల సంఖ్యలో ఉండే సుడిదోమ.. గంటల వ్యవధిలో చాలా నష్టం కలిగిస్తుంది. నివారణకు రైతులు వీలైనంత వరకు చేనులో పాయలు తొక్కాలి. నీరు పూర్తిగా తీసేసి ఆరబెట్టాలి. చేను దిగువ పత్రాల మొదళ్లకు చేరేలా పై మందులు పిచికారీ చేయాలి. – వెంకటరమణారెడ్డి,
జిల్లా వ్యావసాయ అధికారి