
బంగారు ఆభరణాల చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్
సూర్యాపేటటౌన్: బంగారు ఆభరణాల దొంగతనం కేసులో ఇద్దరు దొంగలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సూర్యాపేట ఎస్పీ కె. నరసింహ తెలిపారు. నిందితుల నుంచి 18 తులాల బంగారం ఆభరణాలు, ఒక కారు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ కేసు వివరాలను గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వెల్లడించారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలానికి చెందిన పులిచింతల అరుంధతి 2024 ఆగస్టు 18న సూర్యాపేట జిల్లా మోతె మండలం విభలాపురం గ్రామంలో తన బంధువుల పెళ్లికి బయల్దేరింది. తన బంగారు ఆభరణాలు ఉన్న హ్యాండ్‌బ్యాగ్‌తో సూర్యాపేట బస్టాండ్‌లో ఖమ్మం డిపోకు చెందిన బస్సు ఎక్కి మోతెకు వెళ్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు బంగారు ఆభరణాలు చోరీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మోతె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా బుధవారం సాయంత్రం మోతె మండలం మామిళ్లగూడెం టోల్‌ప్లాజా వద్ద మునగాల సీఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. హైదరాబాద్ నుంచి కారులో వస్తున్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని ఆపారు. వారి వద్ద 18 తులాల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. పట్టుబడిన వారు ఏపీలోని కర్నూలు జిల్లా బుద్రాపేట్ గ్రామానికి చెందిన గారడి జ్యోతి(ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం), హైదరాబాద్‌లోని బడంగ్‌పేటకు చెందిన మహమ్మద్ షేక్ సమీర్‌గా పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా.. పులిచింతల అరుంధతి హ్యాండ్‌బ్యాగ్‌లోని బంగారు ఆభరణాలను బస్సులో దొంగలించినట్లు వారు ఒప్పుకున్నారు. నిందితురాలు గారడి జ్యోతిపై హైదరాబాద్ పరిసర ప్రాంతాల పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు దొంగతనం కేసులు ఉన్నందున.. బంగారు ఆభరణాలు అక్కడ అమ్మితే అనుమానం వచ్చి అరెస్ట్ చేస్తారని.. వాటిని దాచి బుధవారం ఆంధ్రా ప్రాంతంలో అమ్మేందుకు కారులో వెళ్తుండగా పట్టుబడినట్లు ఎస్పీ తెలిపారు. వీరిద్దరికి సహకరించిన దుర్గ అనే మహిళ పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, డీసీఆర్‌బీ డీఎస్పీ రవి, మునగాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఫ 18 తులాల బంగారు
ఆభరణాలు, కారు, సెల్‌ఫోన్ స్వాధీనం