
నేడు లోక్ ఆదాలత్
భువనగిరిటౌన్ : జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో శనివారం జాతీయ లోక్ ఆదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు జయరాజు, కార్యదర్శి మాధవిలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు లోక్ అదాలత్ ప్రారంభం అవుతుందని, రాజీపడదగిన అన్ని రకాల కేసులు పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అమ్మ పేరుతోమొక్కలు నాటాలి : డీఈఓ
భువనగిరి : అమ్మపేరుతో ఈనెల 14న ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని డీఈఓ సత్యనా రాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 6నుంచి 12వ తరగతి విద్యార్థులు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, ఎంఆర్సీ సిబ్బంది మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. మొక్కలు నాటే సమయంలో పొటో తీసి సంబంధిత యాప్‌లో ఆప్‌లోడ్ చేయాలని సూచించారు. జిల్లాకు ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు హెచ్‌ఎంలు సహకరించాలని పేర్కొన్నారు.
తహసీల్దార్ కార్యాలయం తనిఖీ
గుండాల: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం అదనపు కలెక్టర్ వీరారెడ్డి తనిఖీ చేశారు. రికార్డులు, భూ భారతి దరఖాస్తులను పరిశీలించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. దరఖాస్తులను 22ఏ రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ హరికృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ నీలిమ, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఉన్నారు.
వైద్యుడి సస్పెన్షన్‌కు ఆదేశాలు
ఆత్మకూరు(ఎం) : మండలంలోని కూరెల్ల పల్లె దవాఖాన వైద్యుడు అశోక్‌కుమార్ సస్పెన్షన్‌కు కలెక్టర్ హనుమంతరావు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సమయంలో డాక్టర్‌తో పాటు ఏఎన్‌ఎం విధుల్లో లేకపోవడంతో అక్కడే ఉన్న ఆశా కార్యకర్తను ప్రశ్నించారు. ఏఎన్‌ఎం మందులు తీసుకురావడానికి వెళ్లిందని ఆశా కార్యకర్త సమాధానం ఇచ్చింది. కాగా డాక్టర్ అశోక్‌కుమార్ వారంలో ఒక రోజు మాత్రమే విధులకు వస్తాడని గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. హాజరు రిజిస్టర్‌ను పరిశీలించగా ప్రతి రోజూ విధులకు హాజరవుతున్నట్లు వైద్యుడి సంతకాలు ఉండటంతో సస్పెండ్ చేయాలంటూ డీఎంహెచ్‌ను ఆదేశించారు. అనంతరం తుక్కాపురంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరి శీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి సూచనలు చేశారు. ఆయన వెంట ఎంపీడీఓ రాములు నాయక్, ఎంపీఓ పద్మావతి, పంచాయతీ కార్యదర్శి అంబోజు శేఖర్ ఉన్నారు.

నేడు లోక్ ఆదాలత్