
కొందరి కోసం రైతులను ముంచుతారా
చౌటుప్పల్ : చౌటుప్పల్‌లోని దివీస్ పరిశ్రమ కోసం రాష్ట్ర ప్రభుత్వం రీజినల్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ మార్చిందని, కొందరి ప్రయోజనాల కోసం రైతులను ముంచుతారా అని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రశ్నించారు. గతంలో రూపొందించిన ప్రకారంగా రీజినల్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ను ఉంచాలని డిమాండ్ చేస్తూ చౌటుప్పల్, నారాయణపురం, వలిగొండ మండలాలకు చెందిన వివిధ గ్రామాల భూనిర్వాసితులు తమ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిబంధనల ప్రకారం అలైన్‌మెంట్‌ను 40కిలోమీటర్ల దూరానికి మార్చాలని డిమాండ్ చేశారు. భూమికి భూమి ఇవ్వాలని, లేనిపక్షంలో బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధర ప్రకారం మూడు రెట్ల పరిహారం చెల్లించాలని నిర్వాసితులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లకంటి సత్యం పాల్గొని మాట్లాడుతూ.. కొందరికి మేలు చేసేందుకు వందలాది మందిని ఆగం చేయొద్దని ప్రభుత్వానికి సూచించారు. కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమను రైతులపై చూపాలన్నారు. కంపెనీలకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అభివృద్ధి ముసుగులో చేసే మోసానికి వ్యతిరేకమని తెలిపారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూనిర్వాసితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం ఔటర్ రింగ్‌రోడ్డు(ఓఆర్‌ఆర్) నుంచి రీజినల్ రింగ్‌రోడ్డు(ట్రిపుల్‌ఆర్) నడుమ దూరం 40కిలోమీటర్లు ఉండాల్సిందేనన్నారు. కోట్లు విలువ చేసే భూములు తీసుకుని, ప్రభుత్వం భూనిర్వాసితులకు చెల్లిస్తున్న డబ్బులతో స్థానికంగా ఒక్క ప్లాటు కూడా వచ్చే పరిస్థితులు లేవన్నారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. రీజినల్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ మార్పిడికి దివీస్ పరిశ్రమ నుంచి ప్రభుత్వానికి అందిన ముడుపులే కారణమని ఆరోపించారు. ముడుపులు ముట్టకుంటే జిల్లా మంత్రి, మునుగోడు ఎమ్మెల్యే రైతుల పక్షాన ఎందుకు ఉండడంలేదని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే ఓఆర్‌ఆర్ నుంచి ట్రిపుల్‌ఆర్‌ను 60కిలోమీటర్ల దూరం నుంచి వేయిస్తానని చెప్పిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పుడు ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు. గతంలోని అలైన్‌మెంట్‌ను ఎందుకు మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అలైన్‌మెంట్ అంశాన్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. అలైన్‌మెంట్ మార్పిడి అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందన్నారు. రాష్ట్రం అలైన్‌మెంట్‌ను మారిస్తే అందుకు అయ్యే ఖర్చు భరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రం తీరుతో ట్రిపుల్‌ఆర్ ఉత్తర భాగంలో గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్ మున్సిపాలిటీలు ముక్కలవుతున్నాయని తెలిపారు. భూనిర్వాసితులకు న్యాయం చేస్తే కోమటిరెడ్డి బ్రదర్స్‌కు రాజకీయాలకతీతంగా పాలాభిషేకం చేస్తామన్నారు. నిర్వాసితుల వేదిక చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు రమనగోని శంకర్, బూరుగు కృష్ణారెడ్డి, గుజ్జుల సురేందర్‌రెడ్డి, సుర్వి యాదయ్య, దూడల భిక్షంగౌడ్, శాగ చంద్రశేఖర్‌రెడ్డి, కై రంకొండ అశోక్, గిర్కటి నిరంజన్, పల్లె శేఖర్‌రెడ్డి, బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, చిలుకల శ్రీనివాస్, కడారి కల్పన, బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి, చినుకని మల్లేశం, తాడూరి పరమేష్, తొర్పునూరి నర్సింహ్మ, భూనిర్వాసితులు పాల్గొన్నారు.
ఉద్రిక్తత..
ఆర్డీఓ కార్యాలయం ముట్టడి ముగిసిన తర్వాత తిరిగి బయల్దేరే క్రమంలో భూనిర్వాసితులు, అఖిలపక్ష నాయకులు హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై రాస్తారోకో చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకోగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. కొందరు హైవే పైకి వెళ్లి బైఠాయించారు. ఆందోళనకారులను పోలీసులు లాక్కెళ్లి తమ వాహనాల్లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయినా వెనక్కి తగ్గని నిర్వాసితులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రాస్తారోకో చేసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. చేసేదేమీ లేక నిర్వాసితులు హైవే పైకి వెళ్లకుండా పోలీసులు పలు ప్రాంతాల్లో పోలీసు వాహనాలను అడ్డుగా పెట్టారు. రోప్ పార్టీల ద్వారా జనాలను అడ్డుకున్నారు. భూనిర్వాసితులు, అఖిలపక్ష నాయకులు చౌటుప్పల్ బస్టాండ్ వద్దకు చేరుకొని అక్కడ నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితిని అర్థం చేసుకొని ఆందోళన విరమించాలని పోలీసులు పలుమార్లు కోరడంతో శాంతించారు. కొంతసేపటి తర్వాత నిర్వాసితులను విడిచిపెట్టారు.
ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
ఫ అఖిలపక్షం ఆధ్వర్యంలో చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించిన రీజినల్ భూనిర్వాసితులు
ఫ హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై రాస్తారోకోకు యత్నం