
స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
గరిడేపల్లి: మహిళలు, యువతులు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌బీఐ రిలేషన్‌షిప్ మేనేజర్ వి. అనిల్ అన్నారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో చిరుధాన్యాలతో ఉత్పత్తుల తయారీపై యువతులు, మహిళలకు నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చిరుధాన్యాల ప్రాముఖ్యత, ఉపయోగాలను తెలియజేసిన ఈ శిక్షణ మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. మహిళలు గ్రూపులుగా ఏర్పడి చిరుధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసుకోగలిగితే ఎంతో మందికి ఉపాధి కల్పించడంతో పాటు ఆరోగ్యం, ఆదాయం కూడా లభిస్తుందన్నారు. బ్యాంకుల ద్వారా లోన్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అనంతరం శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేవీకే ఇన్‌చార్జి ప్రోగ్రాం కోఆర్డినేటర్ నరేష్, గృహ విజ్ఞాన శాస్త్రవేత్త ఎన్. సుగంధి, శాస్త్రవేత్తలు ఎ. కిరణ్, సీహెచ్. నరేష్, డి. ఆదర్శ్, పి. అక్షిత్ పాల్గొన్నారు.