
విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలి
తిరుమలగిరి(తుంగతుర్తి): తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ తెలంగాణ విమోచన ఉత్సవ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ సి. అంజిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుమలగిరిలో నిజాంకు వ్యతిరేకంగా కొనసాగిన పోరాటంలో అమరులైన బండి యాదగిరి, పోరెల్ల దాస్ స్మారక స్థూపాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న దోపిడి, అణచివేత, ఖాసీం రజ్వి అమానుష పీడనను చరిత్ర ఎప్పటికీ మరచిపోదన్నారు. అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ ప్రాంతానికి స్వేచ్ఛ లభించిందని అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వం లాగానే ప్రస్తుత రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. బండి యాదగిరి, పోరెల్ల దాస్ త్యాగాల నుంచి యువత స్ఫూర్తి పొందాలి సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కడియం రామచంద్రయ్య, విమోచన కమిటీ రాష్ట్ర కన్వీనర్ నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి, జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్‌రెడ్డి, పాతూరి కరుణ, బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, సూర్యాపేట జిల్లా విమోచన కమిటీ కన్వీనర్ మన్మథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ బీజేపీ తెలంగాణ విమోచన
ఉత్సవ కమిటీ చైర్మన్ అంజిరెడ్డి