
ఆరోగ్య భవిష్యత్ మహిళల చేతుల్లోనే..
భువనగిరి: మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుందని, తద్వారా ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. స్వస్థనారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 17నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో మహిళల కోసం వైద్యశిబరాలు నిర్వహించాలన్నారు. మాతాశిశు ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్ సంబంధిత వ్యాధులను గుర్తించడంతో పాటు పాఠశాలలు, వసతి గృహాల్లో పిల్లలకు వ్యక్తిగత ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ మనోహర్, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, జెడ్పీసీఈఓ శోభారాణి, డీఈఓ సత్యనారాయణ, డీసీహెచ్‌ఎస్ చిన్ననాయక్, డీడబ్ల్యూఓ నర్సింహరావు, ఎయిమ్స్ అడిషనల్ డైరెక్టర్ కళ్యాణి, జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ధనుంజనేయులు తదితరులు పాల్గొన్నారు.