
51 % సాగు
2,29,671 ఎకరాల్లో వివిధ పంటలు
ఫ వర్షాభావంతో తగ్గిన సాగు విస్తీర్ణం
ఫ సాధారణం కంటే 229,666 ఎకరాలు తక్కువ
ఫ గణనీయంగా పడిపోయిన వరి, అదే బాటలో పత్తి
సాక్షి, యాదాద్రి: వర్షాభావ పరిస్థితుల కారణంగా వానాకాలం పంటల సాగు విస్తీర్ణం తక్కువగా ఉంది. సాధారణ సాగు విస్తీర్ణం 4.50 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు 2,29,671 ఎకరాల్లో వివిధ రకాల పంటలు వేశారు. సీజన్ మొదలై రెండు నెలలు గడిచినా లోటు వర్షపాతమే నమోదైంది. సరైన వర్షాలు లేక చాలామంది రైతులు సాగుబాట పట్టకుండా మిన్నకున్నారు.
వరి 1.31 లక్షల ఎకరాల్లోనే..
వ్యవసాయ అధికారుల అంచనా ప్రకారం వరి సాగు 2,36,168 ఎకరాలు కాగా.. 1,31,174 ఎకరాల్లో నాట్లు వేశారు. అది కూడా మూసీ పరీవాహక మండలాలైన భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్, రామన్నపేట మండలాల్లో అధికంగా నాట్లు పడ్డాయి. నాన్ ఆయకట్టులో 30 శాతం కూడా నాట్లు వేయలేదు.
వరి బాటలోనే పత్తి
వర్షాధార పంటలైన పత్తి, కంది సాగు గణ నీయంగా తగ్గింది. 1.15 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అంచనా వేయగా 98,121 ఎకరాలకు మించలేదు. కంది 6 వేల ఎకరాలు అంచనా వేయగా.. కేవలం 376 ఎకరాల్లోనే సాగు చేశారు. ఇతర మెట్ట పంటలు మచ్చుకై నా కనిపించడం లేదు.
లోటు వర్షపాతం
సీజన్ ప్రారంభంలో మురిపించిన వర్షాలు.. ఆ తరువాత జాడలేకుండా పోయాయి. జూన్ చివరి వారంలో, జూలై మొదటి వారంలో మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో సాగు పుంజుకుంటున్న తరుణంలో మళ్లీ వరుణుడు ముఖం చాటేయడంతో సాగు డీలా పడింది. జూన్ నెలలో సాధారణ వర్షపాతం 99.2 మి.మీ కాగా.. 56.5 మి.మీ కురిసింది. సాధారణం కన్నా 42 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. జూలైలో 236.5 మి.మీటర్లకు గాను 228.6 మి.మీ కురిసింది. 3 శాతం లోటు వర్షపాతం నమోదైంది.
లోతుల్లోకి భూగర్భ జలం
వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు పడిపోయాయి. గత సంవత్సరం జూలై నెలా ఖరులో 10.90 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలం.. ఈ ఏడాది జూలై 11.87 మీటర్ల లోతుకు వెళ్లింది. నారాయణపురం, ఆత్మకూర్ మండ లాల్లో దయనీయ పరిస్థితులున్నాయి.