రైతులకు రూ.550 కోట్లు చెల్లించాం
భూదాన్‌పోచంపల్లి: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో 48 గంటల్లోనే బిల్లులు వస్తున్నాయని, ఇప్పటివరకు రూ.550 కోట్లు జమ అయ్యాయని, మరో రూ.30 కోట్లు చెల్లిస్తే వందశాతం పూర్తవుతాయని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. శుక్రవారం భూదాన్‌పోచంపల్లి మండలంలోని జూలూరు, ముక్తాపూర్, రేవనపల్లి, శివారెడ్డిగూడెం, జిబ్లక్‌పల్లి, దంతూర్ గ్రామాల్నోఇ కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యం కుప్పలను పరిశీలించారు. ఎంత ధాన్యం కాంటా చేశారు, కేంద్రాల్లో ఎంత నిల్వ ఉందని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. మిల్లుల వద్ద అన్‌లోడ్ ఆలస్యమవుతుందని తెలుసుకుని లారీ యజమానులు, మిల్లర్లతో కలెక్టర్ ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వర్ష సూచన ఉన్నందున కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హమాలీలు, కాంటాలు, లారీలను పెంచుకొని ఈ నెల 27 వరకు కొనుగోళ్లు పూర్తయ్యేలా చూడాలన్నారు. 370 కొనుగోలు కేంద్రాలకు 110 సెంటర్లలో ధాన్యం సేకరణ పూర్తయినట్లు వెల్లడించారు. 10 పెద్ద సెంటర్లు మినహా జిల్లాలోని మిగతా అన్ని కేంద్రాల్లో నాలుగు రోజుల్లో కొనుగోళ్లు పూర్తవుతాయని చెప్పారు. ఇప్పటి వరకు 2.83లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, మరో 60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో సివిల్‌సప్‌లై జిల్లా అధికారిణి రోజా, జిల్లా మేనేజర్ హరికృష్ణ, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ బాలమణి, ఎంఆర్‌ఐ గుత్తా వెంకట్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారి శైలజ, ఏపీఎం నీరజ, ఏఈఓ నరేశ్, జూలూరు పీఏసీఎస్ చైర్మన్ అందెల లింగంయాదవ్, పోచంపల్లి పీఏసీఎస్ సీఈఓ సద్దుపల్లి బాల్‌రెడ్డి ఉన్నారు.
ఫ 27లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి
ఫ కలెక్టర్ హనుమంతరావు


