వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ అమర్నాథ్
తణుకు అర్బన్: స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ నాయకులు, క్యాడర్ అంతా సిద్ధంగా ఉందని రీజనల్ కో–ఆర్డినేటర్ గుడివాడ అమర్నాఽథ్ అన్నారు. ప్రతి సీటులోనూ గెలుపోటములతో సంబంధం లేకుండా అభ్యర్థులను నిలబెడతామని స్పష్టం చేశారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు కేవలం 2000–2001లో మాత్రమే స్థానిక ఎన్నికలకు వెళ్లే సాహసం చేశారని, మరలా ఇప్పుడే వెళుతున్నారన్నారు. బీసీ ఓట్ల కోసం బీసీ రిజర్వేషన్ అంటూ నాటకం ఆడారని, సుప్రీంకోర్టులో పిటిషన్ కొట్టేస్తారని తెలిసి కూడా కోర్టుకు వెళ్లినట్టుగా చూపించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్న పరిస్థితుల్లో బీసీలపై మీకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో బిల్లు పెట్టి చట్టబద్ధత తీసుకురావచ్చు కదా అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులతోపాటు స్థానిక సమస్యల పరిష్కారానికి స్థానిక ఎన్నికలు కీలకమేనని అందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధంగానే ఉందన్నారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో కోవిడ్ ఇ బ్బందులు ఉన్నా స్థానిక ఎన్నికలకు వెళ్లి 95 శాతం విజయం సాధించామని గుర్తుచేశారు.
కారుమూరి అరెస్టు అక్రమం
మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆయన తనయుడు సునీల్‌కుమార్‌లను అక్రమ అరెస్టులు చేసి జైలుకు పంపారని అమర్నాథ్ మండిపడ్డారు. ఎదురు తిరిగిన వారిపై కేసులు బనాయించడం చంద్రబాబు అండ్ కోకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. కారుమూరి జైలులో ఉన్నా తణుకు నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ బలంగా ఉండటం శుభపరిణామమన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, తణుకు నియోజకవర్గ పరిశీలకుడు కొట్టు నాగు, పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, పంచాయితీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, లీగల్‌సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి, మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి చోడే గోపికృష్ణ, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి పొట్ల సురేష్, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ పెన్మెత్స సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.


