ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో ఆశ్వయుజ మాస దివ్య బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. ఈ నెల 21 నుంచి 28 వరకు నిర్వహించనున్న ఉత్సవాలను వైభవంగా జరిపేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఆలయ రాజగోపురాలు, ఆళ్వార్ల మండపాలు, అనివెట్టి మండపాలతో పాటు ఆలయ పరిసర ప్రాంతాల్లో విద్యుద్దీపాలంకరణ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు, గుడి సెంటర్‌లో స్వామివారి 40 అడుగుల భారీ విద్యుత్ కటౌట్ నిర్మాణ పనులను చేపట్టనున్నారు.
బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఇలా
ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 21న ఉదయం స్వామివారు, అమ్మవార్లను పెండ్లికుమారుడు, పెండ్లికుమార్తెలను చేస్తారు. 22న అంకురార్పణ, ధ్వజారోహణం, 24న ఎదుర్కోలు ఉత్సవం, 25న స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, 26న రథోత్సవం, 27న చక్రస్నానం, ధ్వజావరోహణం, 28న శ్రీపుష్పయాగోత్సవం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈనెల 21 నుంచి 28 వరకు ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు.


