కాళ్ల: రొయ్యల సాగులో నిపుణులైన అధికారుల సూచనల మేరకు మార్కెట్‌లో లభించే నాణ్యమైన ఉత్పత్తులను వాడటం వల్ల రైతులు అధిక లాభాలు సాధించవచ్చని ఇన్నోవేర్ బయోఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ ఐఎస్ రాజు తెలిపారు. తమ కంపెనీ నుంచి ఇప్పటికే 35 ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని, కాళ్ల మండలం పెద అమిరంలో జరుగుతున్న ఆక్వా ఎక్స్‌పో ఇండియా ఎగ్జిబిషన్‌లో కొత్తగా మరో రెండు ఉత్పత్తులను విడుదల చేసినట్లు చెప్పారు. శుక్రవారం భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, సూర్యమిత్ర గ్రూప్ సంస్థల అధినేత యిర్రింకి సూర్యారావు విచ్చేసి వివిధ స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆక్వా ఎక్స్ చైర్మన్ దంతులూరి వేణు రాజు వారికి స్వాగతం పలికి సత్కరించారు. ఇలాంటి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనల ద్వారా స్వదేశీ, విదేశీ కంపెనీల ఉత్పత్తులు రైతులకు పరిచయమై ఎంతో మేలు జరుగుతుందని నాయకులు పేర్కొన్నారు.


