‘పశ్చిమ’లో పులి కలకలం | - | Sakshi
Sakshi News home page

‘పశ్చిమ’లో పులి కలకలం

Oct 10 2026 1:22 AM | Updated on Oct 10 2026 1:22 AM

● ఉదయం జిల్లా దాటి, రాత్రి సమయానికి మళ్లీ జిల్లాకు వచ్చిన వైనం

● పులి సంచారంతో ఉలిక్కిపడిన గూడెం గ్రామాలు

తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం మండలం ఆరుళ్ల గ్రామంలో పులి సంచార ఆనవాళ్లు కనిపించడంతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. శుక్రవారం వేకువజామున పొలాలకు వెళ్లిన రైతులు, ఆరుళ్ల వంతెన ఎదురుగా రోడ్డు దాటి వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లిన పులి పాదముద్రలను గమనించి అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, అటవీ, పోలీస్‌ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పాదముద్రలను పరిశీలించారు. రిటైర్డ్‌ అటవీశాఖాధికారి చలపతిరాజు సహాయంతో పోలీసులు భీమవరం డీఎఫ్‌ఓకు ఫోటోలు పంపి అవి పులి ఆనవాళ్లేనని నిర్ధారించారు. వెంటనే డ్రోన్‌ టీమ్‌ను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు. మారంపల్లి, ఆరుళ్ల, నందమూరు గ్రామాల ప్రజలు పొలాలకు వెళ్లవద్దని, ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అధి కారులు మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు.

ఎర్రకాలువ పరీవాహక ప్రాంతం మీదుగా ప్రయాణం?

అటవీ ప్రాంతం కాని ఇక్కడికి పులి ఎలా వచ్చిందనే విషయంపై విస్తృత చర్చ సాగుతుంది. ఎర్రకాల్వ పరీవాహక ప్రాంతం మీదుగా తాడేపల్లిగూడెం మండలం, అక్కడి నుంచి వేరే జిల్లాకు వెళ్లే అవకాశం ఉంటుందంటున్నారు. కొంగువారిగూడెంలోని కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాలువ జలాశయం మీదుగా నల్లజర్ల మండలం అనంతపల్లి, అక్కడి నుంచి తాడేపల్లిగూడెం మండలం మాధవరంలోని కంసాలిపాలెం వంతెన వరకు, కంసాలిపాలెం దాటిన తర్వాత మారంపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న రైల్వే వంతెన కిందుగా ఆరుళ్ల వంటి ప్రాంతానికి చేరుకునే వీలుంటుందని ఈ ప్రాంతం గురించి తెలిసిన అధికారులు విశ్లేషిస్తున్నారు. అయితే కాల్దరి రోడ్డుపై పులి దాటుతున్నట్టు ఫొటో ఒకటి వచ్చింది. అది ఏఐనా, వాస్తవమే అని నిర్ధారించుకోవాల్సి ఉంది. భీమవరం డీఎఫ్‌ఓ చెప్పిన వివరాల ప్రకారం పులికి అమర్చిన జీపీఎస్‌ ద్వారా ప్రస్తుతం పులి కాల్దరికి మూడు కిలోమీటర్ల సమీపంలోని పసలపూడి వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్నట్టు తెలిపారు. అయితే రాత్రి సమయానికి నందమూరు పరిసర ప్రాంతాల్లోని పొలాలకు చేరుకుందని వివరించారు. పులిని బంధించేందుకు పూణే నుంచి నిపుణులు శనివారం చేరుకుంటారని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement