పంచాయతీ రికార్డుల రగడ | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ రికార్డుల రగడ

Oct 10 2026 1:22 AM | Updated on Oct 10 2026 1:22 AM

జంగారెడ్డిగూడెం(చింతలపూడి) : పంచాయతీ రికార్డుల నిర్వహణ, అభివృద్ధి నిధుల వ్యయంపై తలెత్తిన వివాదం దేవులపల్లి, పుట్లగట్లగూడెం గ్రామాల్లో తీవ్ర కలకలం రేపింది. దేవులపల్లి పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో, పొరుగునే ఉన్న పుట్లగట్లగూడెం పంచాయతీ కార్యాలయానికి గ్రామస్థులు తాళం వేయడం సంచలనంగా మారింది. ప్రస్తుత పుట్లగట్లగూడెం కార్యదర్శి బాపూజీ, ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు దేవులపల్లి పంచాయతీకి ఇన్‌చార్జ్‌ కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ సమయంలో రెండు సీసీ రోడ్లు, మూడు డ్రెయిన్ల నిర్మాణ పనుల్లో రూ. 12 లక్షల నిధులు దుర్వినియోగం అయ్యాయని, సర్పంచ్‌ సంతకాన్ని ఫోర్జరీ చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీని ప్రభావంతో తమ పంచాయతీ (పుట్లగట్లగూడెం) రికార్డులు కూడా సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు.

కార్యదర్శి గదికి తాళం

శుక్రవారం ఉదయం పుట్లగట్లగూడెం గ్రామానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు దాదాపు 100 మందికి పైగా పంచాయతీ కార్యాలయానికి చేరుకుని రికార్డులు, ఎం–బుక్స్‌ చూపించాలని కార్యదర్శిని డిమాండ్‌ చేశారు. కార్యదర్శి కొన్ని రికార్డులు చూపించి, అత్యవసర పనిపై బయటకు వెళ్లడంతో రికార్డులు మార్చేస్తారనే అనుమానంతో గ్రామస్తులు ఆయన గదికి బయట నుంచి తాళం వేశారు. ఉన్నతాధికారుల సమక్షంలోనే రికార్డులను పరిశీలించాలని పట్టుబట్టారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను కార్యదర్శి బాపూజీ ఖండించారు. దేవులపల్లిలో అప్పటి సర్పంచ్‌ సమక్షంలో, తీర్మానం ప్రకారమే పనులు ప్రతిపాదించామన్నారు. పనుల బిల్లులు ఇంకా సమర్పించలేదని, ప్రభుత్వం నుంచి రూపాయి కూడా విడుదల కానప్పుడు నిధుల దుర్వినియోగం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఈ విషయమై డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ రాజుని వివరణ కోరగా అవినీతి ఆరోపణలపై ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. ఫిర్యాదు వస్తే సమగ్ర విచారణ జరిపి, నిధులు దుర్వినియోగమైనట్లు తేలితే రికవరీ చేస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement