భీమవరం : దక్షిణ భారత స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు భీమవరం డీఎన్నార్ కళాశాల విద్యార్థి బి. మోహన్‌సాయి ఎంపికై నట్లు కళాశాల వైస్ ప్రిన్సిపల్ బీవీఎస్ వర్మ తెలిపారు. శుక్రవారం మోహన్‌సాయిని కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు) ప్రత్యేకంగా అభినందించారు. విజయవాడలోని వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన జేఎన్‌టీయూకే అంతర్ కళాశాలల సెంట్రల్ జోన్ బ్యాడ్మింటన్ పోటీలలో మోహన్‌సాయి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఈ అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కె. ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.
తణుకు అర్బన్: రాష్ట్ర అంతర్ జిల్లా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్–2026 అండర్–14 విభాగం జావెలిన్ త్రోలో తణుకు మాంటిస్సోరీ స్కూలు విద్యార్థిని ఐ.అశ్రిత రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల డైరెక్టర్ అనపర్తి ప్రకాశరావు తెలిపారు. ఈ నెల 3న ఆదోనిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన అశ్రిత, ఈ నెల 23, 24 తేదీల్లో చెన్‌నైలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల యాజమాన్యం అభినందించింది.


