భీమవరం : గీత కార్మికులను మోసం చేస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నర్సింహామూర్తి హెచ్చరించారు. శుక్రవారం కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో బతుకు పోరాట గర్జన పేరిట భీమవరం పట్టణంలో మోకులు, కల్లు కుండలతో భారీ ప్రదర్శన నిర్వహించి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయాన్ని ముట్టడించారు. అక్రమ మద్యాన్ని అరికట్టాలని, గీత వృత్తిని కాపాడాలని, బెల్టు షాపులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎకై ్సజ్ కార్యాలయం ఎదుట రోడ్డుపై కల్లు పోసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నర్సింహామూర్తి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన బెల్టు షాపుల వల్ల గీత కార్మికుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కర్ణాటక తరహాలోనే హోటళ్లు, బార్లలో కల్లు అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే 50 ఏళ్లు నిండిన గీత కార్మికులకు గుర్తింపు కార్డులు, పింఛన్ మంజూరు చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి కోరారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా ఎక్సైజ్ శాఖాధికారి బి.సుబ్బారావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు బొక్కా చంటి, కడలి పాండు, మామిడిశెట్టి నాగభూషణం, బొంతు శ్రీనివాస్, దాసరి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.


