భీమవరం: ఆక్వా రంగంలో అధునాతన సాంకేతిక పరికరాలను వినియోగించడం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉందని, ఈ తరుణంలో ఆక్వా ఎక్స్ ఎగ్జిబిషన్స్ రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. భీమవరం పట్టణ సమీపంలోని పెదఅమిరం రాధాకృష్ణ కన్వెన్షన్ సెంటర్‌లో ఈనెల 8వ తేదీ నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న ఆక్వా ఎక్స్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ బ్రోచర్‌ను బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొయ్యే మోషేన్‌రాజు మాట్లాడుతూ.. ఆక్వా రంగంలో రైతులకే కాకుండా యువతకు కూడా అనేక రకాల ఉపాధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆక్వా ఎక్స్ ఫౌండర్ దంతులూరి వేణు మాట్లాడుతూ.. మూడు రోజులపాటు జరిగే ఈ ఆక్వా ఎక్స్‌పోలో రైతులకు ఎంతో ఉపయోగపడే అనేక రకాల ఆధునిక పరికరాలతో పాటు మేత (ఫీడ్) తదితర ఉత్పత్తులను వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ కంపెనీలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. రైతులు ఈ ప్రదర్శనను సందర్శించి, సరికొత్త పరికరాలను తమ సాగుకు అన్వయించుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చని సూచించారు.


