● హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళన బాట
● మూడు రోజులుగా కొనసాగుతున్న నిరసన కార్యక్రమాలు
భీమవరం(ప్రకాశం చౌక్) : తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన బాట పట్టారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు వైద్య సేవలు అందించిన తమ పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర కాంట్రాక్ట్ ఉద్యోగుల అసోసియేషన్ పిలుపు మేరకు, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద గత మూడు రోజులుగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకున్నా కూటమి ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదు. ఉన్నత అధికారులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో, కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) పిలుపు మేరకు బుధవారం వైద్య సేవలూ బహిష్కరించి ఆందోళన చేపట్టారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఈ న్యాయపోరాటాన్ని మరింత తీవ్రం చేయనున్నట్లు ఉద్యోగులు స్పష్టం చేశారు.
కనీస వేతనం, ఉద్యోగ భద్రత కరువు
రోజురోజుకూ పెరుగుతున్న నిత్యవసర ధరలు, కుటుంబ పోషణ, పిల్లల చదువుల ఖర్చులకు తగిన వేతనం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. విధుల్లో ఉండగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కనీస ఎక్స్‌గ్రేసియా కూడా చెల్లించడం లేదని, దీంతో ఆ కుటుంబాల బతుకులు దారుణంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్లుగా సేవ చేస్తున్నా రెగ్యులరైజ్ చేయకపోవడం పట్ల తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది.
ప్రధాన డిమాండ్లు
● కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకుని అర్హులందరినీ వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. అప్పటి వరకు వంద శాతం గ్రాస్ వేతనం చెల్లించాలి.
● 2018 నుంచి అమలవుతున్న వేతన తగ్గింపు విధానాన్ని సమీక్షించాలి.
● భవిష్యత్తులో వైద్య శాఖలో ఏర్పడే ఖాళీలను రెగ్యులర్ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేయాలి.
● విధుల్లో మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.
● పరస్పర అవగాహనతో స్పౌజ్ కోటా బదిలీలకు అవకాశం కల్పించాలి.
● శాశ్వత ఉద్యోగుల మాదిరిగానే పెయిడ్ సిక్ లీవ్‌లు, ఈహెచ్‌ఎస్ హెల్త్ కార్డులు అందజేయాలి.


