గెనోడేర్మా యాజమాన్య పద్ధతులతో రైతులకు మేలు | - | Sakshi
Sakshi News home page

గెనోడేర్మా యాజమాన్య పద్ధతులతో రైతులకు మేలు

Oct 8 2026 12:54 AM | Updated on Oct 8 2026 12:54 AM

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఏలూరు జిల్లాలో ఉద్యాన శాఖ అధికారులు ఆయిల్‌పామ్‌ రైతులకు వేరుకుళ్లు తెగులుపై కీలక సూచనలు చేశారు. ఇటీవల తోటలలో గుర్తించిన ఈ తెగులును నివారించేందుకు రైతులు తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలని హెచ్చరించారు. జిల్లాలో దాదాపు 1,60,000 ఎకరాలలో ఆయిల్‌పామ్‌ సాగు చేస్తుండగా, ఇటీవల 15 సంవత్సరాల పైబడిన తోటలలో శ్రీగెనోడెర్మాశ్రీ తెగులును పరిశీలించినట్లు తెలిపారు. ఇది నేల ద్వారా సంక్రమించే శిలీంధ్రమని, ఆయిల్‌పామ్‌ చెట్లలో కాండం మొదలు కుళ్లిపోవడానికి ఇది కారణమవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో ఆయిల్‌పామ్‌ చెట్లకు ఈ తెగులు సోకడాన్ని గమనించామని, దీనివల్ల రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లడంతో పాటు తోటల దిగుబడి తగ్గి, ఉత్పాదకత క్షీణించి పంట జీవిత కాలం ముప్పులో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

యాజమాన్య పద్ధతులు ఇలా..

● తెగులు సోకిన మొక్కను తొలి దశలోనే గుర్తించడం ద్వారా ప్రభావితమైన చెట్టును సులభంగా కాపాడుకోవచ్చు.

● ముందస్తు నివారణ చర్యగా నేలలో ట్రైకోడెర్మా విరిడే, సూడోమోనాస్‌ ఫ్లోరోసెన్స్‌ను 100 కేజీల ఎఫ్‌వైఎం / వేపపిండి / వెర్మికంపోస్ట్‌లో ఒక కేజీ / లీటరు చొప్పున కలిపి మొక్కకు దగ్గరలో వేసుకోవడం ద్వారా తెగులును నివారించుకోవచ్చు.

● మొక్కలు నాటుకునే సమయంలో ట్రైకోడెర్మా, సూడోమోనాస్‌ పొడి కానీ ద్రావణం కానీ గుంటకి కేజీ చొప్పున వేయాలి.

● నేల, పత్ర విశ్లేషణ ఆధారంగా పోషకాలను, ట్రైకోడెర్మాను వేప పిండితో కలిపి సంవత్సరానికి ఒకసారి క్రమం తప్పకుండా వేసుకోవాలి.

● నిర్ణీత వ్యవధిలో వ్యాధులపై పరిశీలన తప్పనిసరి. 1 మీటర్‌ లోతు, 30 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న గుంతను తవ్వడం ద్వారా గెనోడెర్మా సోకిన చెట్టును వేరుచేయాలి. తద్వారా వ్యాధి సోకిన వేర్లు ఆరోగ్యకరమైన వేర్లతో సంబంధం లేకుండా ఉంటాయి.

● వ్యాధి లక్షణాలను చూపించే చెట్ల నుంచి ఆరోగ్యవంతమైన చెట్లను వేరుచేయాలి. తోటలలో పచ్చి పశువుల పేడను వేయరాదు.

● పడిపోయిన చెట్లను మళ్ళీ నాటడం, తొలగించిన చెట్లు, కుళ్ళిపోతున్న సేంద్రియ పదార్థాలు వ్యాధి కలుగజేసే శిలీంధ్రం పెరుగుదలకు, విస్తరణకు అనుకూలమైన వాతావరణాన్నిస్తాయి. కాబట్టి చనిపోయిన, పడిపోయిన చెట్ల కాండం, వేర్లను ముక్కలుగా చేసి కాల్చివేయాలి.

● నీటి పారుదల, మల్చింగ్‌తో నేలలో సరిపడా తేమను నిర్వహించుకోవాలి. చెట్ల మొదలులో, భూమిలో నీరు ఎక్కువగా నిలిచిపోకుండా చూసుకోవాలని అధికారులు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement