తాడేపల్లిగూడెం : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో నియోజకవర్గ నాయకులకు పలు కీలక పదవులు దక్కాయి. ఈ మేరకు బుధవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి అధికారికంగా నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లాలోని వివిధ విభాగాలకు చెందిన నాయకులకు ఈ పదవులలో సముచిత స్థానం లభించింది.
పదవులు ఇలా..
పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యునిగా పార్టీ సీనియర్ నాయకుడు, పట్టణ కమిటీ మాజీ అధ్యక్షుడు గుండుబోగుల నాగేశ్వరరావు (నాగు) నియమితులు కాగా, మరో సీనియర్ నాయకుడు గుండుమోగుల బలుసులరావు రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే, రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా నల్లమిల్లి విజయానందరెడ్డి, కార్యదర్శిగా కర్రి ఎస్‌ఆర్‌ఎస్ రెడ్డి నియమితులయ్యారు. బీసీ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా కలిశెట్టి తాతారావు, సంయుక్త కార్యదర్శిగా వీరమల్లు సుబ్రహ్మణ్యం దక్కించుకోగా, ఎఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శులుగా కండెల్లి రాజేష్, లంకా రాజశేఖర్ నియమితులయ్యారు. ఇతరుల విభాగాల విషయానికి వస్తే.. రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కార్యదర్శిగా ఇందుకూరి శ్రీనివాసరాజు, పంచాయతీ రాజ్ వింగ్ కార్యదర్శిగా మాకరాజు సతీష్, సంయుక్త కార్యదర్శిగా కోనేటి దానయ్య, అలాగే పబ్లిసిటీ వింగ్ సంయుక్త కార్యదర్శిగా వెలనాటి వీరవెంకటసత్యనారాయణ (సత్తిబాబు) లను పార్టీ నియమించింది.
పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం
ఇలా పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయి నాయకులకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రాధాన్యత దక్కడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండింది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి సావిత్రిపేటలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. తమ నియామకాలకు సహకరించిన నియోజకవర్గ కన్వీనర్ వడ్డి రఘురామ్‌కు నూతన పదవులు దక్కిన నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆచంట నాయకులకు పదవులు
వైఎస్సార్ సీపీలో ఆచంట నియోజకవర్గ నాయకులకు పార్టీ పదవులు వరించాయి. స్టేట్ బీసీ సెల్ కార్యదర్శిగా పూతినీడి వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శిగా కుక్కల సూర్యనారాయణ, ఎస్‌సీ సెల్ కార్యదర్శిగా సుంకర సీతారాం, స్టేట్ మహిళా విభాగం కార్యదర్శిగా కర్రి గౌరీసుభాషిణి నియమితులయ్యారు.


