ఏలూరు టౌన్: మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ కఠిన చర్యలు చేపట్టినట్లు ఏలూరు వన్‌టౌన్ సీఐ కే. రామకృష్ణ తెలిపారు. గంజాయి అక్రమ రవాణా కార్యకలాపాలకు పాల్పడే నేరస్తులపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు. ఏలూరు ఆర్‌ఆర్‌పేట ప్రాంతానికి చెందిన భవిరి జగదీష్‌ను పీఐటీ–ఎన్‌డీపీఎస్ చట్టం కింద అరెస్ట్ చేసి, నిర్బంధ చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు. జగదీష్‌పై గతంలో ఏలూరు రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి ఎన్‌డీపీఎస్ కేసులు నమోదయ్యాయి. అతని నేర కార్యకలాపాలు నిరంతరం కొనసాగుతుండటం, ఇది ప్రజారోగ్యానికి, సమాజానికి ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉండటంతో.. అతడిపై నిర్బంధ నిరోధక ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపామని వివరించారు. ప్రభుత్వ ఉత్తర్వులు, ఏలూరు డీఎస్పీ డీ. శ్రావణ్‌కుమార్ ఆదేశాల మేరకు, జగదీష్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. అనంతరం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు.


