కాంట్రాక్టర్ నుంచి ఉద్యోగుల ఖాతాల్లోకి
కష్టాల్లో ఉన్న వరద బాధితులను ఆదుకోవాల్సిన ఏలూరు నగరపాలక సంస్థ అధికారులు, దాన్ని కూడా తమ స్వాహా పర్వానికి అనుకూలమైన ఆదాయ వనరుగా మలుచుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండేళ్ల క్రితం విజయవాడలో సంభవించిన వరదల వేళ, సహాయక చర్యల పేరుతో స్వల్పంగా ఖర్చు చేసి.. కొండంత బిల్లులు పెట్టి ప్రజాధనాన్ని పక్కదారి పట్టించిన వైనం వెలుగులోకి వచ్చింది.
సాక్షి ప్రతినిధి, ఏలూరు: 2024 సెప్టెంబర్ మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలు, బుడమేరు ఉప్పొంగడంతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని సింగ్‌నగర్, దాని పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ సమయంలో వరద బాధితులకు ఆపన్నహస్తం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పష్టమైన ఆదేశాలిస్తూ అక్షయపాత్ర ఫౌండేషన్, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆహార పంపిణీ చేపట్టాలని, సమీప మున్సిపాలిటీల నుంచి పారిశుధ్య కార్మికులను మాత్రమే పంపాలని సూచించారు. అయితే ప్రజాప్రతినిధుల మెప్పు కోసమంటూ ముందుకొచ్చిన ఏలూరు నగరపాలక సంస్థ అధికారులు.. ఈ ఆదేశాలను పక్కనపెట్టి సహాయక చర్యల పేరుతో ఏకంగా రూ. 3 కోట్ల కంటే పైగా నిధులను సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రూ. 2.75 కోట్ల నామినేషన్ బిల్లులు
సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు ఆహార సరఫరా, పారిశుధ్య కార్మికుల కేటాయింపు పేరుతో తొలివిడతగా రూ. 55 లక్షల బిల్లులను అధికారులు సిద్ధం చేసి ఏలూరు జిల్లా కలెక్టర్ కే. వెట్రిసెల్వికి సమర్పించగా, ఆమె వాటిని మంజూరు చేశారు. అయితే అక్కడితో ఆగకుండా మళ్లీ భారీ మొత్తంలో బిల్లులు పట్టుకుని రావడంతో కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమోదించలేదు. కలెక్టర్ నిరాకరించినప్పటికీ వెనక్కి తగ్గని అధికారులు, మున్సిపల్ నిధుల నుంచే చెల్లించుకోవచ్చనే ధీమాతో 2024–25 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన 294 నామినేషన్ పనులలో 12 బోగస్ బిల్లులను చేర్చారు. శ్రీ సాయి ఏజెన్సీ పేరుతో రూ. 2.75 కోట్లను చెల్లించి, ఆపై తమ వాటాలను పంచుకున్నట్లు సమాచారం. రూ.1,500 కోట్ల వార్షిక బడ్జెట్ ఉన్న విజయవాడ నగరానికి, కేవలం రూ.200 కోట్ల బడ్జెట్ ఉన్న ఏలూరు కార్పొరేషన్ నుంచి ఈ స్థాయిలో సాయం చేయడం, దానికి భారీగా నామినేషన్ బిల్లులు సృష్టించడం గమనార్హం.
దాతల సాయమూ గాయమే : ఒకవైపు ప్రభుత్వ నిధులను మళ్లిస్తూనే, మరోవైపు ఏలూరులోని స్థానిక దాతల నుంచి కూరగాయలు, పాలు, తాగునీరు, నిత్యావసరాలు, ఆహార పొట్లాలు సేకరించారు. ఇలా సుమారు రూ. 50 లక్షల విలువైన వస్తువులను విరాళాల రూపంలో సమీకరించినప్పటికీ, వాటిని ఎవరికి పంపిణీ చేశారో, ఎక్కడ వినియోగించారో వివరాలు లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
వాస్తవానికి మెప్మా పరిధిలోని డ్వాక్రా మహిళల ద్వారా భోజనం సిద్ధం చేసి పంపిణీ చేశారు. ఎక్కడా ఆహార సరఫరాకు ప్రత్యేక కాంట్రాక్ట్ ఇచ్చిన దాఖలాలు లేవు. అయినప్పటికీ ఏజెన్సీ నుంచి కార్మికులను పంపినందుకు రూ.4.18 లక్షల బిల్లు, సెప్టెంబర్ 2న అల్పాహారం, రెండు పూటల భోజనానికి రూ.15.36 లక్షల బిల్లు, 3న రూ.29.77 లక్షలు, 4న రూ. 29.23, 5న 27.46 లక్షలు అదే రోజు కేవలం డిన్నర్‌కు రూ.18.60 లక్షలు, 6న రూ.35.44 లక్షలు, 7న రూ.35.44 లక్షలు, 8న రూ.35.44 లక్షలు, 9న రూ.35.44లక్షల విలువైన బిల్లులు శ్రీసాయి ఏజెన్సీకి చెల్లించారు. ఈ విధంగా కాంట్రాక్టర్‌కు జమ అయిన సొమ్ము నుంచి బడా నేతలు, ఉన్నతాధికారికి సన్నిహితంగా ఉండే సుమారు ఎనిమిది మంది ఔట్‌సోర్సింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్ల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు ఆన్‌లైన్ ద్వారా నగదు బదిలీ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆపై ఆ మొత్తాన్ని కీలక వ్యక్తులకు చేరవేసినట్లు తెలుస్తోంది. మానవతా దృక్పథంతో చేయాల్సిన సాయాన్ని కూడా అవినీతికి వేదికగా మార్చుకోవడంపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఏలూరు నగరపాలక సంస్థలో మరో దోపిడీ పర్వం
కృష్ణా వరదల సమయంలో రూ.2.50 కోట్లకుపైగా దోపిడీ
రూ.55 లక్షల బిల్లులు తొలుత మంజూరు చేసిన కలెక్టర్
మళ్లీ నామినేషన్ ప్రాతిపదికన రూ.2.75 కోట్లు ఖర్చు చేసినట్లు బిల్లులు


