భీమవరం (ప్రకాశంచౌక్): గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు, ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించి చిత్స అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన విలేజ్ హెల్త్ క్లినిక్స్‌ను మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కృష్ణా జిల్లా జనార్ధనపురం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భీమవరం కలెక్టరేట్‌లోని వశిష్ట సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని, జిల్లా స్థాయి ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పీఎం అభిమ్ నిధులతో రూ.3.56 కోట్లతో 12 పనులు, 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.9 కోట్లతో 32 పనులు, ఎన్‌హెచ్‌ఎం నిధులతో రూ.7.93 కోట్లతో 104 పనులు ౄ మొత్తం రూ.20.49 కోట్ల అంచనా వ్యయంతో 148 పనులు మంజూరు కాగా, ఇప్పటివరకు రూ.3.38 కోట్లతో 100 పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం పెనుగొండ మండలం తమరాడ, యలమంచిలి మండలం బూరుగుపల్లి గ్రామాలలో నూతన క్లినిక్‌లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి రవిబాబు, ఇతర అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.


