● చిట్టడవిల్లా ఏఎంసీల ప్రాంగణాలు
● శిథిలావస్థలో భవనాలు
● ఆదాయమంతా ప్రభుత్వ ఖజానాకు !
ఆకివీడు: రైతులకు సేవలందించాల్సిన వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) యార్డులు చిట్టడవులను తలపిస్తూ అధ్వానంగా మారాయి. రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా అభివృద్ధి మాత్రం ఏ మాత్రం జరగడం లేదు. ఉండి నియోజకవర్గంలో ఆకివీడు, ఉండి ఏఎంసీలు ఉన్నాయి.
మార్కెట్ యార్డు కమిటీలకు పాలకవర్గాల్ని ఏర్పాటు చేసినా ఖజానాలో చిల్లిగవ్వ కూడా ఉంచకుండా ప్రభుత్వం దొలిచేస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆకివీడు ఏఎంసీకి ఏటా రూ.6 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. సుమారు రూ.40 కోట్లకు పైగా నిధులున్నాయి. అలాగే ఉండి ఏఎంసీకి రూ.4 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. అయితే ఆయా మార్కెట్ యార్డుల్లో సిబ్బంది జీతా ల బిల్లులు తప్ప ఒక్క రూపాయి కూడా విడుదల కావలేదు. ప్రభుత్వం ఇతర అవసరాలకు మార్కెట్ కమిటీల నిధులను తరలిస్తోందని రైతులు అంటున్నారు.
యార్డుల్లో పనులు లేవు
మార్కెట్ యార్డుల్లో పార మట్టి తీసేందుకు కూడా ఖజానాలో రూపాయి లేదు. దీంతో చినుకపడితే ప్రాంగణాలు చెరువులను తలపిస్తున్నాయి. అలాగే ప్రాంగణాల్లో పచ్చగడ్డి, మొక్కలు పెరుగుతున్నాయి. క్రిమికీటకాలకు, విషసర్వాలకు నిలయంగా మారు తూ చిట్టడవులను తలపిస్తున్నాయి.
షెడ్లు, భవనాలు శిథిలం
ఏఎంసీల్లో భవనాల్లో శిథిలవుతున్నాయి. భవనాలపై నీరు నిలిచి శ్లాబులు పెచ్చులూడుతున్నాయి. రేకుల షెడ్లు తుప్పుపట్టి పోతున్నాయి. అలాగే కళ్లాలు నీరుగారిపోతున్నాయి. కొన్ని విద్యుత్ స్తంభాలు నేలకొరగ్గా విద్యుత్ కనెక్షన్లు తొలగించారు. పరిస్థితి ఇలా ఉన్నా నిధుల లేమితో ఎలాంటి పనులు చేయలేకపోతున్నారు.
స్టోరేజ్‌లుగా మార్చాలి
మార్కెట్ యార్డులను ఐస్ ప్లాంట్‌లు, రొయ్యలు స్టోరేజ్ గొడౌన్లు, ప్రొసెసింగ్ సెంటర్లు, ప్యాకింగ్ కేంద్రాలకు అనుకూలంగా మార్చాలని రైతులు కో రుతున్నారు. అలాగే ఓపెన్ గోడౌన్లలో సంత మా ర్కెట్‌ను ఏర్పాటుచేయాలని అంటున్నారు.
వర్షం నీరు నిలిచి ఇలా..


