భీమవరం అర్బన్: గ్యాస్ లీకై మంటల్లో చిక్కుకుని తీవ్ర గాయాల పాలైన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. రూరల్ ఏఎస్సై వైవీ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం కొత్తపూసలమర్రు గ్రామానికి చెందిన జల్లా మహలక్ష్మి (81) ఆదివారం తన పెద్దకూతురు ఇంటికి వెళ్లి 4 రోజులు ఉండి వచ్చి తన ఇంటి తలుపులు తీయగానే గ్యాస్ లీకై మంటలు వ్యాపించడంతో ఆ మంటల్లో చిక్కుకుని తీవ్ర గాయాలపాలైంది. ఆమెను మెరుగైన వైద్యం నిమిత్తం భీమవరం నుంచి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఏఎస్సై వైవీ సత్యనారాయణ తెలిపారు. ఈ ఘటనపై అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
నూజివీడు: మండలంలోని జంగంగూడెం పరిధిలో సోమవారం పిడుగు పడి పురిటిపాటి వెంకట రెడ్డి(70) అనే వృద్ధుడు మృతిచెందాడు. గేదెలు మేపుకునేందుకు జంగంగూడెంకు చెందిన వెంకటరెడ్డి పొలాల్లోకి గేదెలను తోలుకెళ్లాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఉరుములు, మెరుపులతో జల్లులు పడగా అక్కడ అతనిపై పిడుగుపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమీపంలోని వారు చూసి సమాచారాన్ని గ్రామంలోని కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతుడికి భార్య, ఇరువురు కుమార్తెలు ఉన్నారు. పిడుగుపడి వృద్ధుడు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.


