పాలకొల్లు సెంట్రల్: భార్యపై కక్ష పెంచుకుని బీరు సీసాతో కిరాతకంగా దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మీనగర్‌కు చెందిన డి. కుమారికి రమేష్‌తో 15 ఏళ్ల క్రితం వివాహం కాగా, వారికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. భర్త మద్యానికి బానిస కావడంతో ఇద్దరూ గత రెండేళ్లుగా విడిగా ఉంటున్నారు. సోమవారం మధ్యాహ్నం కుమారి తన చెల్లెలితో కలిసి మారుతి సెంటర్‌లోని సినిమా థియేటర్‌కు మధ్యాహ్నం 2 గంటల షోకి వెళ్లింది. సినిమా ముగించుకుని బయటకు వస్తుండగా, థియేటర్ గేటు వద్దే కాపు కాచిన రమేష్ ఆమె వద్దకు వచ్చాడు. ముందుగా తన వద్ద ఉన్న బీరు సీసాతో తన తలపైన కొట్టుకుని, ఆపై అదే సీసాతో ఆమె వీపు, మెడపై విచక్షణారహితంగా పొడిచాడు. ఆమె తప్పించుకునే ప్రయత్నం చేయడంతో భుజంపై తీవ్ర గాయమైంది. ఆ తర్వాత నిన్ను పొడిచేశాను, ఇక వెళ్లిపోదాం రా అంటూ నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలిని స్థానికులు 108 ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


