కాళ్ల: ఈ నెల 8, 9, 10 తేదీలలో భీమవరం సమీపంలోని పెదఅమిరం రాధాకృష్ణ కన్వెన్షన్ సెంటర్‌లో ఆక్వాఎక్స్ ఇండియా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో భారీ ఆక్వా ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు ఆక్వా ఎక్స్ ఫౌండర్, చైర్మన్ వేణు దంతులూరి తెలిపారు. పెదఅమిరంలోని డిప్యూటీ స్పీకర్ కార్యాలయంలో రఘురామకృష్ణంరాజుతో కలిసి సోమవారం బ్రోచర్ ఆవిష్కరించారు. రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తాజా విధానాలు ఆక్వా రంగంలో లభించే అవకాశాలపై ఈ ఎగ్జిబిషన్‌న్‌లో సమగ్రంగా వివరించనున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్న రైతులతో పాటు యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ ప్రదర్శనలో క్రియాశీలకంగా పాల్గొని అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఆక్వా ఎక్స్ ఇండియా డైరెక్టర్ రఘురాం తదితరులు పాల్గొన్నారు.
ఉండి: స్థానిక బాలాజీరావుపేటలోని జన్మభూమి పార్క్ ఎదురుగా ఉన్న విశ్వభారతి ఎగ్స్ షాపులో పట్టపగలే దొంగతనం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి షాపు గల్లాపెట్టలో ఉన్న సుమారు రూ.17,000 నగదును ఎత్తుకెళ్లాడు. పక్కనే ఉన్న తౌడు కొట్టును శుభ్రం చేసుకుంటున్న షాపు యజమాని కే. విశ్వేశ్వరరావుకు మొబైల్ ఫోన్ ద్వారా నోటిఫికేషన్ రావడంతో, ఆయన తన కుమారుడిని వెళ్లి చూడమన్నారు. అప్పుడు ఒక వ్యక్తి షాపులో నగదు దొంగిలిస్తున్నట్లు వారు గుర్తించారు. యజమాని, ఆయన కుమారుడు చుట్టుపక్కల గాలించినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో, సీసీటీవీ ఫుటేజ్‌తో సహా ఉండి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భీమడోలు: ఐసీఏఆర్ పీజీ ప్రవేశ పరీక్షల్లో భీమడోలుకు చెందిన పనస ఉదయలక్ష్మి జాతీయ స్థాయిలో 20వ ర్యాంకు, ఓబీసీ విభాగంలో 10వ ర్యాంకు సాధించింది. ప్లాంట్ బయోటెక్నాలజీ మేజర్ గ్రూపులో నిర్వహించిన పరీక్షల్లో సత్తాచాటి ఢిల్లీ అగ్రికల్చర్ వర్సిటీలో ఎంఎస్సీ(అగ్రికల్చర్) సీటు దక్కించుకుంది. బాపట్ల వ్యవసాయ వర్సిటీలో బీఎస్సీ పూర్తిచేసిన ఆమె వ్యవసాయ శాస్త్రవేత్త కావడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఆమె తండ్రి ప్రసాద్ పోలీస్ హోంగార్డుగా పనిచేస్తున్నాడు.


