చింతలపూడి : పశుగ్రాసం పెంపకంలో మెలకువలు పాటించాలి. రైతులకు వ్యవసాయంతో పాటు పశుపోషణ ఆర్థికంగా ఎంతో తోడ్పాటునిస్తుంది. ఈ నేపథ్యంలో పశుపోషణలో పశుగ్రాసం కీలక పాత్ర పోషిస్తుంది. మెట్ట ప్రాంతాల్లో పాడి పశువులను పెంచుకునే రైతులు పశుగ్రాసం పండించడంలో మెలకువలు తెలుసుకుంటే మేలు జరుగుతుందని వ్యవసాయ సహాయ సంచాలకులు వై. సుబ్బారావు తెలియజేస్తున్నారు. ప్రస్తుత ఏడాది వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో పశువులకు పశుగ్రాస కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ దశలో గ్రామీణ ప్రాంతాల్లో పాడిని నమ్ముకున్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పశుపోషణలో 70 శాతం ఖర్చు మేతకే అవుతుందని తెలిసిందేనని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలను రైతులకు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.
పశుగ్రాసం పండించుకుంటే..
వర్షాకాలంలో పశుగ్రాసం పండించుకుంటే వేసవిలో పశువుల పోషణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన సూచిస్తున్నారు. పండ్ల తోటల్లోని మొక్కల మధ్య ఖాళీ ప్రదేశాల్లో పప్పుజాతి పశుగ్రాసాలైన అలసంద, ఉలవ, పిల్లిపెసర, జనుము, మొక్కజొన్న వంటి పంటలను సాగు చేయడం ద్వారా పశుగ్రాస కొరతను అధిగమించవచ్చు. అంతేకాకుండా, దీనివల్ల భూమిలో నత్రజని స్థిరీకరించబడి భూసారం పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి.
జనుము
ఇది కాయజాతి పశుగ్రాసం. అన్ని నేలల్లోనూ, అన్ని కాలాల్లోనూ కొద్దిపాటి నీటితో దీన్ని పండించుకోవచ్చు. ఎకరానికి 12 కిలోల విత్తనాలను 50 కిలోల సూపర్‌ఫాస్ఫేట్‌తో కలిపి చల్లాలి. విత్తిన తర్వాత 40 నుంచి 50 రోజులకు ఇది కోతకు వస్తుంది. ఈ మేతను పూత దశలో కోసి ఎండుమేతగా వినియోగించుకుంటే పశువులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
పిల్లిపెసర
వరి సాగు చేసే అన్ని భూముల్లోనూ అంతర పంటగా దీన్ని సాగు చేసుకోవచ్చు. సాధారణ భూముల్లో పచ్చిరొట్ట ఎరువుగా వాడినట్లయితే భూమికి మంచి బలం చేకూరుతుంది. శీతాకాలంలో రబీ పంటగానూ ఈ పశుగ్రాసాన్ని సాగు చేసుకోవచ్చు. ఈ పశుగ్రాసం వేర్లలో ఉండే నత్రజని బుడిపెలు భూమిని మరింత సారవంతం చేస్తాయి. వరి పంట కోయడానికి 3 నుంచి 4 రోజుల ముందు (భూమిలో తేమ ఉన్నప్పుడే) ఎకరానికి 10–15 కిలోల విత్తనాలను 50 కిలోల సూపర్‌ఫాస్ఫేట్‌తో కలిపి చల్లుకోవాలి. 50 రోజుల్లో కోతకు వచ్చే ఈ పశుగ్రాసం ద్వారా ఎకరానికి 10 నుంచి 12 టన్నుల పచ్చిమేత లభిస్తుంది.
ఇతర రకాలు
పశుగ్రాస మొక్కజొన్నలో ఆఫ్రికన్ టాల్, జె–1006, విజయ కాంపోజిట్ రకాలు 85 రోజుల్లో ఒకేసారి కోతకు వస్తాయి. వీటిని పండ్ల తోటలు, పామాయిల్ తోటల్లో కూడా సాగు చేసుకోవచ్చు. ఇవి రైతులకు అధిక పశుగ్రాస దిగుబడులను అందిస్తాయి. ఇక పప్పుజాతి రకాలైన అలసందలు (బొబ్బర్లు) – రష్యన్ జైంట్, బుందేల్ లోబియ–1, 2, ఈసీ 4216–5287, కేబీసీ–2 మొదలైన రకాలు 55 నుంచి 60 రోజుల్లో ఒకే కోతలో నాణ్యమైన పశుగ్రాసాన్ని అందిస్తాయి.
వై సుబ్బారావు,వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్


