బుట్టాయగూడెం: భారీ వర్షాల కారణంగా మూడు రోజులపాటు నిలిచిపోయిన గుబ్బల మంగమ్మ తల్లి దర్శనాలను తిరిగి ఆదివారం ప్రారంభించడంతో భక్తులు తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి దూపదీప నైవేద్యాలతో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీవారు బందోబస్తు నిర్వహించారు.
జాతీయ గో–కార్టింగ్
చాంపియన్‌గా భీమవరం
అగనంపూడి (విశాఖ): జాతీయస్థాయి గో–కార్టింగ్ చాంపియన్‌షిప్‌లో భీమవరానికి చెందిన ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల బృందం విజేతగా నిలిచింది. దువ్వాడలోని విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో గత నెల 30 నుంచి ఆదివారం వరకు నిర్వహించిన పోటీల్లో రెండు తెలుగు రాష్ట్రాలు, ఒడిశాకు చెందిన 9 బృందాలు పాల్గొన్నాయని కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్, రెక్టార్ మధుసూదనరావు తెలిపారు. వాహనాల సాంకేతిక తనిఖీ, పనితీరు పరిశీలన, బ్రేక్ పరీక్షలు, డైనమిక్ రౌండ్లు, ఎండ్యూరెన్స్ రేసులు నిర్వహించారు. వేగం, వాహన నియంత్రణ, బ్రేకింగ్ సామర్థ్యం, సుస్థిర పనితీరు, అత్యంత వేగవంతమైన ల్యాప్ విభాగాల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. భీమవరానికి చెందిన ఎస్‌ఆర్‌కేఆర్ కళాశాల చాంపియన్‌గా, విశాఖకు చెందిన ఏఐటీఎస్ రన్నరప్‌గా నిలిచాయి.


