పశ్చిమ గోదావరి జిల్లా కూటమిలో రెండేళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బాహాటంగానే రచ్చకెక్కుతున్నాయి. నియోజకవర్గాల్లో ఆధిపత్యం, ప్రోటోకాల్ వివాదాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు ఈ విభేదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.
‘ఎమ్మెల్యే గారు.. మీరు, మీ నియోజకవర్గం ఆఫీసర్లు సరిగా పనిచేయడం లేదు. అన్నిట్లో మైనస్ ఉన్నారు’ అంటూ ఇటీవల ప్రజావేదిక సభలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నరసాపురం కూటమిలో నిప్పు రాజేశాయి. చంద్రబాబు కావాలనే తమ పార్టీ ఎమ్మెల్యేను జనంలో చులకన చేశారని జనసేన కేడర్ మండిపడింది. టీడీపీ, తన సామాజికవర్గం ఎమ్మెల్యేలపై ఎక్కడైనా ఈవిధంగా బహిరంగ రివ్వూ ఇచ్చారా? కనీసం మీ మీద గానీ, ప్రభుత్వంపై గాని రివ్యూ చేసుకున్నారా? మహిళలకు నెలకు రూ. 1500 ఇచ్చారా? నిరుద్యోగభృతి ఇచ్చారా? రెండేళ్లయినా కొత్త పింఛన్లు, హౌసింగ్ లోన్లు లేవు. ప్రజల్లో తల ఎత్తుకోలేకున్నాం. పథకాలేవని అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నామంటూ బాహాటంగానే చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. నిధులు ఇవ్వకుండా నిందలేమిటి చంద్రబాబు? అంటూ ఎమ్మెల్యే నాయకర్ పేరిట ఒక కరపత్రం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది’
సాక్షి, భీమవరం: జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి ఒప్పందంలో భాగంగా టీడీపీ నాలుగు, జనసేన మూడు స్థానాల్లో గెలుపొందగా, నరసాపురం ఎంపీ స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది. అయితే జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ టీడీపీ నేతల హవానే నడుస్తోందని జనసేన శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్యేలకు పోటీగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ చేయడం, ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించడం ఘర్షణ వాతావరణానికి దారితీస్తోంది. మరోవైపు, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకొల్లు, ఆచంట, ఉండి, తణుకు నియోజకవర్గాల్లో తమకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని జనసేన, బీజేపీ కేడర్ నిరాశతో ఉంది.
తాడేపల్లిగూడెంలో రాజీనామా సవాల్
తాడేపల్లిగూడెంలో జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జి మధ్య విభేదాలు ఇప్పటికే భగ్గుమన్నాయి. ఇటీవల ఒక కార్యక్రమంలో బాబ్జి మాట్లాడుతూ వార్డుల్లో ఎక్కడకు వెళ్లినా రోడ్లు లేవంటున్నారని, దోమల సమస్య చెబుతున్నారని చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బొలిశెట్టి స్పందించారు. ఎమ్మెల్యే పనిచేయడం లేదని ఎవరితోనైనా అనిపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ చేశారు. తాను వచ్చాక ఎన్ని కోట్లు రూపాయల వర్కులు జరిగింది? ఎన్ని రోడ్లు వేసింది? ఎన్ని డ్రెయిన్లు, ఎన్ని ఫిల్టర్ బెడ్లు కట్టింది? చరిత్ర చెబుతుందన్నారు. పదేపదే ప్రొటోకాల్‌కు విరుద్ధంగా ఇష్టానుసారం చేస్తామంటే చూస్తు ఊరుకోన్నారు. లోకల్ ఎలక్షన్స్‌లో జనసేన గెలిచే స్థానాలను ఎవరి కోసం త్యాగం చేసేది లేదని ఎమ్మెల్యే బొలిశెట్టి స్పష్టం చేశారు.
వెంపలో స్వపక్ష నేతపై ప్రజా కూటమి
ఒకప్పుడు సంక్రాంతి కోడిపందేలకు రాష్ట్రంలో పేరొందిన భీమవరం రూరల్ వెంప కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. గ్రామం నుంచి నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్న టీడీపీ నేతకు వ్యతిరేకంగా జనసేన, బీజేపీతో పాటు టీడీపీలోని మరొక వర్గం ప్రజా కూటమిగా ఏర్పడుతున్నట్టు జనసేన నేత కలిదిండి బంగార్రాజు తదితరులు ప్రకటించారు. సదరు నేత వైఖరితో రెండేళ్లుగా వెంప అభివృద్ధిలో వెనకబడిందని, కోడి పందేలు, పేకాట, జూదాలతో గంజాయి వనంలా మారిందని మండిపడ్డారు. తాగునీటి సమస్య పరిష్కారానికి పల్లిపాలెం ప్రజలు ఆందోళన చేస్తే పోలీసులతో దౌర్జన్యం చేయించారని, గ్రామాభివృద్ధి కోసం డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ రూ. 43 లక్షలు మంజూరు చేస్తే పనులు జరుగకుండా అడ్డంకులు కల్పిస్తున్నారన్నారు. గ్రామానికి రోడ్డు మంజూరైతే జనావాసాల్లో కాకుండా ఎక్కడో దూరంగా నిర్మించారంటూ ప్రజా కూటమి నేతలు మండిపడ్డారు. ఆదివారం గ్రామంలో భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నారు.
స్థానిక పోరుపై దృష్టి
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తమ పట్టు నిలుపుకునేందుకు ఇరు పార్టీలు పోటీపడుతున్నాయి. ముఖ్యంగా కీలకమైన తాడేపల్లిగూడెం, భీమవరం, నరసాపురం మున్సిపాల్టీలలో జనసేన అభ్యర్థులనే చైర్మన్లుగా నిలబెట్టాలని ఆ పార్టీ భావిస్తుండగా, భీమవరం, తాడేపల్లిగూడెం పీఠాలపై పాగా వేయాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇరు వర్గాలు ఇప్పటికే ఈ ప్రతిపాదనలను తమ అధిష్టానాల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
జనసేన ఎమ్మెల్యే పనితీరు బాగోలేదంటూ నరసాపురంలో నిప్పుపెట్టిన చంద్రబాబు
నిధులు ఇవ్వకుండా నిందలేమిటంటూ జనసేన కౌంటర్
తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ ఇన్‌చార్జి
వెంపలో టీడీపీ నేతపై జనసేన ఫైర్
పాలకొల్లు, ఆచంటలో సైలెంట్ అయిపోయిన జనసేన కేడర్
కాకరేపుతున్న ‘లోకల్’ పాలిటిక్స్


