భీమవరం : జిల్లాలోని పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం, ఆరోగ్యమే ధ్యేయంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. శనివారం పట్టణంలోని వర్మ హాస్పిటల్స్‌లో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిత్యం ప్రజల రక్షణే ధ్యేయంగా సేవలందిస్తున్న పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డి.విశ్వనాథ్, వర్మ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ పీఆర్‌కే వర్మ, ఏఆర్ డీఎస్పీ ఎంవీవీ సత్యనారాయణ, భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం : పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా డ్వాక్రా వీఓఏల జీతాలు పెంచడంతోపాటు పని భారాన్ని తగ్గించాలని వీఓఏల సంఘం జిల్లా అధ్యక్షురాలు నాగిడి గోవిందమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం భీమవరం పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సంఘ సమావేశంలో గోవిందమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం రోజుకో కొత్త యాప్‌ను తీసుకొచ్చి వీవోఏలపై పని భారాన్ని పెంచుతోందే తప్ప, పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా జీతాలు పెంచడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వీఓఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 6న అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతిపత్రాలు అందించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ డి. కళ్యాణి, కె. వెంకటలక్ష్మి, ఎం. స్వాతి, గూడవల్లి సుధ, డి. రమాదేవి తదిరులు పాల్గొన్నారు.
భీమవరం: పట్టణంలోని ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం నుంచి ఈ నెల 7 వరకు రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలు నిర్వహించనున్నట్లు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు జయరాజు, శ్యాప్ కోచ్ జయలక్ష్మి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జిల్లా ఆర్చరీ అసోసియేషన్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 300 మంది ఆర్చర్లు పాల్గొంటున్న ఈ పోటీల్లో పురుషులు, మహిళల విభాగాలకు సీనియర్ ఇండియన్ రౌండ్, కాంపౌండ్, రికర్వ్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
భీమవరం: సైన్స్ ప్రతిభ అన్వేషణ పరీక్ష (విద్యార్థి విజ్ఞాన్ మంథన్)లో పాల్గొనే విద్యార్థుల రిజిస్ట్రేషన్ గడువును ఈనెల 15 వరకు పొడిగించినట్లు వివిఎం జిల్లా కోఆర్డినేటర్ రేపాక వెంకన్నబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్పందించి తమ పాఠశాలల నుంచి ప్రతి తరగతికి కనీసం ఒక విద్యార్థినైనా రిజిస్టర్ చేయించేలా ప్రోత్సహించాలని కోరారు. ఇతర వివరాల కోసం 98496 66417 నంబరుకు ఫోన్ చేయాలని కోరారు.
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం (డీఎంహెచ్‌పీ) బృందం ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక అవగాహన పోస్టర్లను శనివారం ఆవిష్కరించారు. ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కిషోర్, సైకియాట్రిస్ట్ డాక్టర్ కె. పృథ్వీరాజ్ కలిసి ఈ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ క్రాంతి కుమార్, సైకాలజిస్ట్ శ్రీనివాసరావు, కౌన్సిలర్ సుమన్ బాబు తదితరులు పాల్గొన్నారు.


