పెనుమంట్ర: రాష్ట్రీయ రహదారిపై పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరం గ్రామంలోని యూనియన్ బ్యాంక్ సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బ్రాహ్మణచెరువు గ్రామానికి చెందిన జోగి నరేష్ (38) తన మోటార్‌సైకిల్‌పై బ్రాహ్మణచెరువు నుంచి అత్తిలి వైపు వెళ్తున్నారు. అదే సమయంలో అత్తిలి వైపు నుంచి వేగంగా వస్తున్న కారు.. నరేష్ బైక్‌ను ఢీకొట్టి, అదుపుతప్పి కుడివైపు స్కూటీపై ఆరవల్లి వెళ్తున్న అత్తిలి మండలం ఆరవల్లి గ్రామానికి చెందిన వెలగల బాపిరెడ్డి (60), రామలక్ష్మి (55) దంపతులను ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది, రెండు బైకులు నుజ్జునుజ్జు అయ్యాయి. ప్రమాద ఉధృతికి కారులోని ఎయిర్‌బెలూన్లు కూడా తెరుచుకున్నాయి. ఈ ఘోర ప్రమాదంలో జోగి నరేష్ అక్కడికక్కడే మృతి చెందగా, బాపిరెడ్డి దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులిద్దరినీ 108 వాహనంలో తణుకు ఆసుపత్రికి తరలించారు; ప్రస్తుతం వారు అక్కడ చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, నరేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘ టనపై కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు
ఇటీవలే గల్ఫ్ దేశం నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చిన నరేష్‌కు భార్య, తల్లి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఉత్సాహంగా ఉండాల్సిన కుటుంబంలో ఈ పెను విషాదం చోటుచేసుకోవడంతో నరేష్ మరణ వార్త విని భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది.
ఓ యువకుడు మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు


