దెందులూరు: నాగులదేవునిపాడు బీసీ కాలనీలో గురువారం రాత్రి పది అడుగుల పొడవున్న కొండచిలువ ప్రత్యక్షమైంది. ఏరియాలో భారీ కొండచిలువను చూసి స్థానికులు బెంబేలెత్తి, భయాందోళనతో పరుగులు తీస్తూ కేకలు వేశారు. ఆ సమయంలో మోర్ల చిట్టిబాబు ధైర్యంగా ముందుకు వచ్చి, ఆ కొండచిలువను హతమార్చారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జాతీయ పెంటాథ్లాన్ పోటీలకు జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారని పశ్చిమ గోదావరి జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ సెక్రటరీ ఆదిరెడ్డి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర మోడ్రన్ పెంటాథ్లాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత జూలై 10 నుంచి 12వ తేదీ వరకు ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో లేజర్ రన్ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబరిచిన వారిలో సీనియర్ విభాగంలో జిల్లాకు చెందిన కే అప్పారావు, డీ నాగ మోహనరెడ్డి, కే వాట్సన్ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. వీరు ఈ నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు మహారాష్ట్రలోని నాసిక్ ఇండోర్ స్టేడియంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని సత్యనారాయణ పేర్కొన్నారు.


